శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః || నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తయోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు. 列 భాష్యము : ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శ్లోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్యసేవాపద్ధతులను వివరించెను. ఈ భక్తియుతసేవాకార్యములు శ్రీకృష్ణునకు అత్యంత ప్రియములై యున్నవి. వాని యందు నియుక్తుడైన మనుజుని అతడు ప్రేమతో అనుగ్రహించును. నిరాకారబ్రహ్మమార్గము నందు నిమగ్నుడైనవాడు ఉత్తముడా లేక పూర్ణపురుషోత్తముడగు భగవానుని ప్రత్యక్షసేవలో నియుక్తుడైనవాడు ఉత్తముడా అను ప్రశ్నను అర్జునుడు లేవదీసియుండెను. అర్జునుని అట్టి ప్రశ్నకు శ్రీకృష్ణుడు తన భక్తయుతసేవయే ఆత్మానుభవమునకు గల వివిధ పద్ధతులలో అత్యంత శ్రేష్ఠమైనదనుటలో ఎట్టి సందేహము లేదని స్పష్టముగా సమాధానమొసగినాడు. అనగా సత్సంగము ద్వారా మనుజుడు శుద్ధ భక్తియోగము నెడ అభిరుచిని వృద్ధిచేసికొనుననియు, తద్ద్వారా అతడు ఆధ్యత్మికగురువును స్వీకరించి ఆయన నుండి శ్రవణ, కీర్తనములను చేయుటను ఆరంభించి శ్రద్ధ, అనురాగము, భక్తిభావములతో భక్తియోగమందలి నియమనిబంధనలను పాటించుచు శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడు కాగలడనియు ఈ అధ్యాయమున నిర్ణయింపబడినది. ఈ భక్తిమార్గమే ఈ అధ్యాయమున ఉపదేశింపబడినది. కనుక భక్తియోగమొకటియే ఆత్మానుభవమునకు (శ్రీకృష్ణభగవానుని పొందుటకు) ఏకైక మార్గమనుటలో ఎట్టి సందేహము లేదు. ఈ అధ్యాయమున తెలుపబడినట్లు పరతత్త్వపు నిరాకారభావన మనునది మనుజుడు ఆత్మానుభూతి కొరకు శరణము నొందుట వరకు మాత్రమే ఉచితమైనది. అనగా భక్తులతో సాహచర్యమును పొందుటకు అవకాశము కలుగనంతవరకు మాత్రమే నిరాకారభావనము లాభదాయకము కాగలదు. పరతత్త్వపు నిరాకారభావనలో మనుజుడు ఆత్మానాత్మవిచక్షణ కొరకు ఫలాసక్తి రహితముగా కర్మచేయుచు, ధ్యానించుచు, జ్ఞానసముపార్జనము చేయును. శుద్ధభక్తుని సాంగత్యము పొందనంతవరకు మనుజునికి ఇది అవసరము. కాని అదృష్టవశాత్తు ఎవ్వరైనా కృష్ణభక్తిభావనలో భక్తియుతసేవ యందు ప్రత్యక్షముగా నియుక్తమగు కోరికను వృద్ధిచేసికొనినచో, ఆత్మానుభవమునందు క్రమముగా ఒక మెట్టు నుండి వేరొక మెట్టుకు పురోగమించ నవసరము లేకుండును. భగవద్గీత యందలి ఈ నడుమ ఆరు అధ్యాయములలో వర్ణింపబడినరీతి భక్తియుతసేవ మిక్కిలి అనుకూలమైనది. శ్రీకృష్ణభగవానుని కరుణచే సర్వమును అప్రయత్నముగా ఒనగూడును గనుక అట్టి భక్తియుతసేవ యందు నియుక్తుడైనవాడు దేహపోషణ నిమిత్తమై చింతనొంద నవసరములేదు. శ్రీమద్భగవద్గీత యందలి “భక్తియోగము” అను ద్వాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.