బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రకు సర్వం సిద్దం..

తెలంగాణ బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12 న భారీ ఎత్తున  బహిరంగ సభ నిర్వహించి.. యాత్రను ప్రారంభించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధి టార్గెట్ గా యాత్ర కొనసాగనుంది. ఈ సభకు   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.’ గ్రేటర్’ వాసుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పాదయాత్ర కొనసాగనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

కాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి యాత్ర మొదలై..22న పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలో పాదయాత్ర ముగింపు చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ పాలనను ఎండగట్టి టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా  పాదయాత్ర సాగనుంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించినా పాదయాత్ర కొనసాగిస్తామని పాదయాత్ర ప్రముఖ్ స్పష్టం చేశారు.

ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ విడుదల..

బండి సంజయ్ 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర.. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల గూండా  కొనసాగనుంది. విజయదశమి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈసారి పాదయాత్రను 10 రోజులకే పరిమితం చేశారు కమలనాథులు.  కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనున్నట్లు కమలం పార్టీ నేతలు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే .. ప్రజా సంగ్రామ 3వ విడత పాదయాత్ర విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు బీజేపీ నేత మనోహర్ రెడ్డి. అనుమతి లేదన్న పేరుతో  పోలీసులు అబద్దాలాడుతూ పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేశారని మండిపడ్డారు. పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంతో పాటు.. వాహనాలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. న్యాయస్థానం అనుమతితో.. చివరి మూడు రోజుల్లో చేయాల్సిన పాదయాత్ర లక్ష్యాన్ని ఒకటిన్నర రోజుల్లోనే పూర్తి చేయాల్సి వచ్చిందన్నారు మనోహర్ రెడ్డి.

ఇక  పాదయాత్రలో బండి సంజయ్.. కాలనీల్లో దోమల బెడద, మంచి నీటి సమస్య, విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్ పై వ్యాట్ తగ్గింపు వంటి అంశాలపైనా చర్చించనున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విచ్చల విడిగా ఫీజుల దోపిడీ, ఆసుపత్రుల్లో ఎడాపెడా ఫీజుల మోత వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

అంతిమంగా రాబోయే ఎన్నికలకు ప్రజలను సంసిద్ధం చేసి టీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంచి.