మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. గెలుపు కష్టతరమే..

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. గెలుపు కష్టతరమే..

Munugodubypoll: ఎన్నో ఊహాగానాలు మధ్య ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేసింది. టికెట్ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, పున్నకైలాష్, పాల్వాయి స్రవంతిలు పోటీపడగా..పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్రవంతి వైపే మొగ్గు చూపారు.

కాగా స్రవంతికి దివంగత రాజ్యసభ సభ్యులు  మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు. దీంతో  నియోజక వర్గంలోని పార్టీ నేతలు కార్యకర్తలతో  ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో స్రవంతి… 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన భంగపడింది. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 27 వేల 441 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. తదుపరి 2018 ఎన్నికల్లోను  పార్టీ అభ్యర్థిగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేసి గెలవడంతో.. ఆమెకు మరోసారి నిరాశే ఎదురయ్యింది.

టికెట్ దక్కిన గెలుపు కష్టమే..?

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన  రాజగోపాల్ రెడ్డి మరో 18 నెలల ఎమ్మెల్యేగా పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక అభ్యర్ధిగా.. పాల్వాయి స్రవంతి దక్కించుకున్నప్పటికీ .. త్రిముఖ పోటీలో ఆమె గెలుపు కష్టతరమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగాయి. మరోవైపు పార్టీలో నేతల అంతర్గత కలహాలతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. కార్యకర్తలు నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఇదే సమయంలో తనతో పాటు పార్టీ టికెట్ ఆశించి భంగపడిన పార్టీ  నాయకులను కలుపుకోవాల్సివుండటం ఆమెకు పెద్ద సవాల్ గా మారింది.

ఏదిఏమైనా ఉప ఎన్నిక నోటిఫికేషన్ ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి  పెద్ద గందరగోళానికి తెరదించింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే పార్టీ క్యాడర్ కాపాడుకోవడం  పైనే పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.