ఆఫ్ఘన్ పై భారత విజయం .. కోహ్లీ రికార్డుల మోత..!!

ఆసియా కప్ లో నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్ ,బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన టీంఇండియా 101 పరుగులు భారీ తేడాతో గెలిచింది.చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 53 బంతుల్లోనే 122 పరుగుల చేసి కేరిరీలో 71 వ సెంచరీ నమోదు చేశాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.4 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ అర్ధ సెంచరీతొ రాణించాడు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భువనేశ్వర్ కుమార్ పదునైన బంతులతో ఆఫ్ఘన్ బ్యాట్స్ మెన్స్ ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ.. ఒక మెయిడిన్​ వేయడమే కాకుండా ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటివరకు 84 వికెట్లు తీసిన భువీ.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్​ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​ గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 83 వికెట్లతో స్పిన్నర్​ యజువేంద్ర చాహల్​ అగ్రస్థానంలో ఉన్నాడు.

మూడేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ.. రికార్డుల మోత

ఆఫ్ఘన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విశ్వరూపమే చూపించాడు.దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ కొట్టేశాడు. అంతర్జాతీయ కెరీర్లో 71 వ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 61 బంతుల్లో ఎదుర్కొన్న రన్ మెషిన్ 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు.దాదాపు 1019 రోజులు తమ ఆటగాడి సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆకాంక్షను విరాట్ నేరవెర్చడంతో పాటు విమర్శకుల నోర్లు మూయించాడు. కోహ్లీ సెంచరీతో అతని అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ పోస్టులతో రెచ్చిపోతున్నారు. కాగా విరాట్ 2019 నవంబర్​ 22న చివరి సెంచరీ చేశాడు.

మూడు ఫార్మాట్లలో సెంచరీ.. నాలుగోస్థానం..

ఇక విరాట్ ఆఫ్ఘన్ పై సెంచరీతో టీ20 లో (122) అత్యధిక వ్యక్తి గత స్కోరు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20లో అతనికి ఇదే తొలి సెంచరీ. టీ20ల్లో ఓ ఇన్నింగ్స్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాళ్ల సరసన కోహ్లీ చేరాడు.అంతకుముందు భారత ఆటగాళ్లు ..రోహిత్​(118), సూర్యకుమార్​ యాదవ్​(117) వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నారు.మూడు ఫార్మాట్లలో (అంతర్జాతీయ క్రికెట్​లో టెస్టు, వన్డే, టీ-20) సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా విరాట్​ నిలిచాడు. అతనికంటే ముందు సురేశ్​ రైనా, రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​ 3 ఫార్మాట్లలో సెంచరీలు బాదారు.

సచిన్ సెంచరీ రికార్డుకు చేరువలో కోహ్లీ..

కాగా అంతర్జాతీయ క్రికెట్​ లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్​ రెండో స్థానానికి చేరాడు. ఆసీస్​ దిగ్గజం పాంటింగ్​తో కలిసి 71 సెంచరీలతో స్థానాన్ని పంచుకున్నాడు. భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్ ​ 100 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.అంతేకాక ​ ఇంటర్నేషనల్ టీ20ల్లో 100 సిక్సులు కొట్టిన రెండో భారత ఆటగాడిగా విరాట్ నిలిచాడు. కివీస్​ క్రికెటర్​ మార్టిన్​ గప్తిల్​ 172 సిక్సులతో మొదటిస్థానంలో ఉండగా.. భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ (171) సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 104 సిక్సులతో 9వ స్థానంలో నిలిచాడు.