తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి అగ్రనాయకత్వం!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, శ్రేణులను జాతీయ నాయకత్వం సన్నద్ధం చేస్తోంది. ఇటివల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న కమలదళం.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది.

తెలంగాణాలో బీజేపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో పార్టీ జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి సంతోష్‌, సహా కార్యదర్శి శివప్రకాశ్‌, తరుణ్‌ చుగ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. పార్టీలో సీనియర్స్, జూనియర్స్ తేడా లేకుండా సమన్వయంతో పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీలోకి ముఖ్యనేతలు వచ్చే అవకాశం ఉందని.. ఇప్పటికే ఆపరేషన్‌ ఆకర్ష్ పేరిట పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంకేతాలిచ్చారు.
ఇక ఎప్పటికపుడు రాష్ట్ర పరిస్థితులపై నివేదికల అందుతున్నాయని.. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే అవకాశం ఉంటుందని సంతోష్ తేల్చిచెప్పారు. అంతేకాక నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై తెలంగాణ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలు, ఉద్యోగ నియామకాల్లో అధికార పార్టీ వైఖరిని ఎండగట్టాలని నేతలకు సూచించారు.

మొత్తం మీద తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ చకచకా పావులు కదుపుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనన్న సంకేతాలు ఇస్తోంది.

Optimized by Optimole