పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ అమలు చేయనుందా? కమలనాథుల దూకుడు వెనక దాగున్న మర్మం అదేనా? సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్టేందుకు స్కెచ్ రెడీ అయిపోయిందా? సీనియర్ నేత ఈటల రాజేందర్ తాజా ప్రకటన వ్యూహాంలో భాగమేనా? మమతా బెనర్జీ మాదిరి కేసీఆర్ నూ ఓడించడం సాధ్యమేనా?
తెలంగాణలో కమలనాథులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.ఎనిమిది ఏళ్లలో టీఆర్ఎస్ హామీలతో పాటు వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆర్టీఐని ప్రధాన అస్ర్తంగా వాడారు.స్వరాష్ట్ర సాధనలో ఆత్మబలిదానాలు, పోరాటాల చేసిన కుటుంబాలతో పాటు ఉద్యమకారులపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. కేసీఆర్ పాలనలో.. తమకు న్యాయం జరగలేదని భావిస్తున్న నేతలపై
దృష్టి సారించినట్లు.. నియోజకవర్గాల వారీగా కీలక నేతలకు ఆబాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అటు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న హస్తం పార్టీ సీనియర్ నేతలతో సైతం టచ్ లో ఉన్నట్లు.. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలుపరచాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై తాను పోటిచేస్తానని ఈటల ప్రకటించారు. గజ్వేల్ లో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసినట్లు.. బెంగాల్ తరహా సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందని ఈటల ఘంటాపథంగా చెప్పిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని.. అక్కడి మాదిరి ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని ఓడించాలని ఈటల పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.
స్వరాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులు సీఎం కేసీఆర్ వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఉద్యమ ద్రోహులను కేసీఆర్ అక్కున చేర్చుకుని పదవులు కట్టబెట్టారని వారు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా.. పార్టీ అభ్యర్థుల గెలుపులో కీ రోల్ పోషించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిపై కమలనాథులు ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరి ముఖ్య నాయకులతో .. ఆపార్టీ సీనియర్ నేత
సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తోంది.
మొత్తంమీద తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తునే.. పార్టీలోకి చేరికలపై ఫోకస్ పెట్టింది.దొరికిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ దూకుడు ప్రదర్శిస్తోంది.