తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోన్న కమలనాథులు!

తెలంగాణలో విజయ సంకల్ప సభ సక్సెస్ తో జోరుమీదున్న కమలనాథులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీలను నియమించిన రాష్ట్ర నాయకత్వం.. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ.. ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం హక్కు చట్టం కింద ఒకేసారి 88 దరఖాస్తులు చేసి షాకిచ్చారు.

రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కమలనాథులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ వివిధ ఎన్నికల సందర్భంగా.. జిల్లాల్లో పర్యటించినప్పడు ఇచ్చిన హామీలను వెలికితీసేందుకు.. ఆర్టీఐని ఆయుధంగా వాడుతున్నారు.2014,2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై .. అన్నిశాఖలకు సంబంధించి ఒకేసారి 88 దరఖాస్తులను ఆర్టీఐ ద్వారా దాఖలు చేశారు. వీటి ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు.

టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో అనేక శాఖల్లో అవినీతి జరిగిందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ.. సీఎం కేసీఆర్ కు ప్రాజెక్టు ఏటీఎంలా మారిందంటూ ఏకంగా కమల దళపతి నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన బండిసంజయ్ ఇటీవలే వివిధ కమిటీలను నియమించారు. దీంతో నాయకులంతా అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలో బీజేపీ లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీలో చేరికలపై ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమించినందుకు ఆపార్టీ అధ్యక్షుడు సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ నూ ఢీకొట్టే సత్తా బీజేపీ మాత్రమే సాధ్యమని అన్నారు. నెలకు ఒక్క లీడర్ నైనా పార్టీలోకి తీసుకువస్తానని ఆయన తేల్చిచెప్పారు.

మరోవైపు పార్టీనేతలందరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర బీజేపీ అధిష్టానం. ఇగోలు పక్కనపెట్టి పనిచేయాలని సూచించింది. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని.. అనవసరమైన విషయాల్లో తలదూర్చి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయోద్దని హెచ్చరించింది. పార్టీలో చేరికలకు నియమించిన కమిటీ హైకమాండ్ నిర్ణయం ఆధారంగా నియమించినట్లు తెలిపింది. దానికి అనుగుణంగా నడుచుకోవాలని నేతలకు తేల్చిచెప్పింది.

Optimized by Optimole