బాలీవుడ్ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. ఆందోళనలో షారుఖ్, రణ్ బీర్..

బాలీవుడ్ మూవీలపై బాయ్ కాట్ వివాదం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ నెటిజన్స్ ధాటికి తీవ్రంగా నష్టపోయింది. సినిమా ట్రైలర్ విడుదల నాటినుంచి ‘బాయ్‌కాట్ లాల్‌ సింగ్‌ చడ్డా’ హ్యష్‌ ట్యాగ్‌తో నెటిజన్లు సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో అమిర్ ఖాన్.. హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని హెరిత్తించారు.దీంతో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తీవ్ర ప్రభావం చూపింది. అమిర్ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా.. మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. లాగ్ రన్ లో కలెక్షన్లు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇక అమిర్ ఖాన్  మీడియా వేదికగా సినిమాను బాయ్ కాట్ చేయోద్దంటూ వేడుకున్న ఫలితం లేకపోయింది. సినిమాలో అతనికి జోడిగా నటించిన హీరోయిన్ కరీనా సైతం చేసిన విమర్శలు సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయి. సినిమా నచ్చితే చూడండి లేకపోతే మీ ఇష్టం అనే రీతిలో ఆమె చేసిన పోస్టును జతచేస్తూ హ్యష్ ట్యాగ్ వైరల్ కావడం.. సినిమా నష్టపోవడానికి మరోక కారణంగా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

‘బాయ్ కాట్ పఠాన్’

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ నటిస్తున్న తాజాచిత్రం పఠాన్ పై కూడా బాయ్ కాట్ ప్రభావం చూపే అవకాశముంది. చిత్ర హీరోయిన్ దీపికా పదుకునే .. CAA విషయంలో జేఎన్ యూ కు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. ఆపదలో ఉంటే శత్రుదేశానికి ఆర్థిక సాయం చేసిన షారుఖ్.. దేశం ఆపత్కాలంలో ఉంటే స్పందించరా అంటూ కామెంట్స్ దాడి చేస్తున్నారు.బాయ్ కాట్ పఠాన్ హ్యష్ ట్యాగ్ వైరల్ అవుతుండటంతో సినిమాపై ప్రభావం చూపడం ఖాయమంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బ్రహ్మస్త్ర పై సుశాంత్ సింగ్ ఎఫెక్ట్ ..

ఊహించని విధంగా రణ్ బీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్రపై దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట ఈసినిమాలో సుశాంత్ ని హీరోగా సెలెక్ట్ చేశారని.. అయితే నిర్మాత కరణ్ జోహార్ కావాలని నెపోటిజం ఆలోచనలతోనే అతడిని తీసేశాడనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇక ఆ కారణం చేతనే సుశాంత్ తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందువల్లనే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని సుశాంత్ సింగ్ అభిమానులు.. బాయ్ కాట్ బ్రహ్మస్త్ర ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 న బ్రహ్మస్త్ర పార్ట్ 1 విడుదల అవుతుండటంతో బాయ్ కాట్ ప్రభావంపై చిత్ర నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.