‘ఆర్ఎస్ఎస్’ పై వాస్తవాలు తెలుసుకున్నా.. త్వరలో సినిమా తీస్తా : విజయేంద్రప్రసాద్

ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ కథా రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్. ఇటీవల అనూహ్యంగా రాజ్యసభకు ఎంపీగా ఎంపికయిన ఆయన..తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్‌ రచించిన ‘ది హిందుత్వ పారడైమ్‌’ పుస్తక పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్‌ఎస్‌ఎస్‌ పై కొందరిలో ఉన్న భావనను తొలగించేందుకు త్వరలోనే ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీయనున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. కొన్నాళ్ల క్రితం వరకు ఆర్ఎస్ఎస్‌పై తనకున్న భావన వేరని.. కానీ కథ కోసం ఆ సంస్థ ప్రధాన కేంద్రమైన నాగపూర్ వెళ్లాకా వాస్తవాలు తెలిశాయని..తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానని విజేయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్‌, భజరంగి భాయిజాన్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌.. తానూ స్వయంగా ఆర్ఎస్‌ఎస్‌ పై రూపొందించే సినిమా, వెబ్‌ సీరిస్‌ ఊహకందని రీతిలో ఉంటుందన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈసినిమా ద్వారా ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకమని భావించే వారి భ్రమలను తొలగపోవడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక పుస్తక రచయిత రాంమాధవ్‌ మాట్లాడుతూ.. నిరంతరం సత్యాన్ని అన్వేషించడమే హిందూత్వమని.. ముస్లీంలు , క్రైస్తవులుకు హిందూత్వం వ్యతిరేకంకాదని.. కొందరూ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. హిందూత్వం అంటే ఏంటి అనేవాళ్ల కోసం ‘ది హిందుత్వ పారడైమ్‌’ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. దీంతో పాటు త్వరలో విడుదల కాబోతున్న మరో పుస్తకం ‘పార్టిషన్డ్‌ ఫ్రీడమ్‌’ కవర్‌ పేజీను కూడా ఈకార్యక్రమంలో ఆవిష్కరించారు.