National:
రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల అనంతరం వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోని ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆప్ రెండు స్థానాల్లో, బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ చెరో స్థానంలో గెలిచి ఊరట చెందగా, కేరళలో అధికార సీపీఐ (ఎం) మాత్రం భంగపాటుకు గురయ్యింది. ఈ ఫలితాలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు కొంత ఆనందం, కొంత దు:ఖం మిగిల్చాయి.
గుజరాత్లో కడి రిజర్వుడ్ స్థానాన్ని బీజేపీ నిలుపుకోగా, విసావదర్ స్థానంలో ఆప్ తన పట్టును నిలుపుకొంది. పంజాబ్లోని లూధియానా వెస్ట్ను గెలుచుకున్న ఆప్ రాష్ట్రంలో ఆధిక్యత కనబరిచింది. పశ్చిమ బెంగాల్ లోని కాళీగంజ్ లో అధికార తృణముల్ కాంగ్రెస్ మరోసారి గెలిచింది. కేరళలోని నీలంబర్ లో కాంగ్రెస్ సీపీఐ(ఎం)పై గెలవడంతో అధికార ఎల్డీఎఫ్ కు ప్రతిపక్ష యూడీఎఫ్ తో భవిష్యత్లో ప్రమాద ఘంటికలే అని చెప్పవచ్చు.
బీజేపీకి ప్రయోగాత్మక రాష్ట్రమైన గుజరాత్లో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే సోలంకి మృతితో కడి ఎస్సీ రిజర్వుడ్ స్థానం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డ 39,452 ఓట్ల తేడాతో కాంగ్రెస్పై విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో విసావదర్ నియోజకవర్గం ఫలితం ప్రత్యేకమైంది. మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, 2007 నుండి ఇక్కడ వరుసగా ఓడిపోతున్న బీజేపీ మరోసారి భంగపాటుకు గురైంది. ఇక్కడ 2022లో ఆప్ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేందర్బాయ్ బయానీ 2023లో బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక వచ్చింది. 2022లో ఓడిపోయిన బీజేపీ హర్షద్కుమార్ రబాడియా బయానీ ఎన్నికపై కేసు వేశారు. దీనికి సంబంధించి గుజరాత్ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండగానే ఉప ఎన్నిక రావడంతో రబాడియా కేసును ఉపసంహరించుకున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఆప్ నుండి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు బీజేపీ టికెట్ ఇవ్వకుండా కీర్తి పటేల్ను బరిలోకి దింపింది. ఆప్ తరఫున పోటీ చేసిన పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ ఇటాలియా బీజేపీపై 17,554 ఓట్లతో గెలిచారు. ఈయన 2015లో పాటిదార్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఇక్కడ కాంగ్రెస్ 2022లో 11.57 శాతం ఓట్లు పొందగా 2025లో 3.7 శాతం ఓట్లే పొందింది. రాష్ట్రంలో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య అవగాహన, పొత్తు లేకపోతే రెండు పార్టీలు నష్టపోయే అవకాశాలున్నాయని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆప్ పార్టీకి గుజరాత్తో పాటు పంజాబ్ ఫలితం కూడా ఆనందాన్ని మిగిల్చాయి. పంజాబ్లోని లుధియాన్ వెస్ట్లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్పై 10,637 ఓట్లతో గెలవడంతో ఆ పార్టీ తమ స్థానాన్ని నిలుపుకుంది. ఈ ఎన్నికలు ఆప్ రాజకీయాల్లో మార్పులు తెచ్చే అవకాశాలున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆప్ ఇక్కడ సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ భతర్ భూషణ్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంతో ఆప్లో మార్పు చేర్పుల అవకాశాలున్నాయి.
పశ్చిమ బెంగాల్లో బీజేపీతో నిత్యం తలపడుతున్న మమతా బెనర్జీకి కాళిగంజ్ ఉప ఎన్నిక ఫలితం మంచి బలానిచ్చింది. రాష్ట్రంలో మమతా ప్రభుత్వంపై పలు స్కాంల ఆరోపణలు, ఉపాధ్యాయ నియామకాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు, రాష్ట్రంలో పలు చోట్ల మత ఉద్రిక్తతలు మధ్య జరిగిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తృణమూల్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణంతో నిర్వహించిన ఉప ఎన్నికలో ఆమె కుమార్తె అలీఫా అహ్మద్ బీజేపీ అభ్యర్థి ఆశిష్ ఘోష్పై 50 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కాళిగంజ్ విజయంపై మమతా బెనర్జీ మాట్లాడుతూ మా (తల్లి), మతి (మట్టి), మానుష్ (ప్రజలు) కారణంగానే గెలిచినట్టు వ్యాఖ్యానించి సెంటిమెంట్ రగిల్చారు. ముస్లింలు అధికంగా ఉన్న కాళిగంజ్లో కాంగ్రెస్ అభ్యర్థి కబిల్ ఉద్దీన్ షేక్కు సీపీఐ(ఎం) మద్దతిచ్చినా మూడో స్థానానికే పరిమితం కావడంతో 2026 శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణముల్, బీజేపీల మధ్యే జరిగే అవకాశాలున్నట్టు స్పష్టమవుతోంది.
ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేరళలోని నీలంబర్ నియోజకవర్గం భిన్నమైంది. మిగతా నాలుగు స్థానాలను సిట్టింగ్ పార్టీలే గెల్చుకోగా నీలంబర్లో మాత్రం అధికార కూటమి ఎల్డీఎఫ్కు గట్టి దెబ్బ తగిలింది. నీలంబర్ లో 2016, 2021లో వరుసగా రెండు పర్యాయాలు ఎల్డీఎఫ్ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి పీవీ అన్వర్ ఆ కూటమి ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేగానే గుర్తింపు పొందారు. అయితే ఆయనకు సీఎం పినరాయి విజయన్తో విభేదాలు రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అన్వర్ ఎల్డీఎఫ్ వీడడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ లోక్ సభ పరిధిలో నీలంబర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో కాంగ్రెస్ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యాదన్ షౌకత్ 44.17 శాతం ఓట్లు పొంది సీపీఐ(ఎం) అభ్యర్థి స్వరాజ్పై 11,077 ఓట్ల తేడాతో గెలిచారు. తృణముల్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అన్వర్ 11.23 శాతం ఓట్లతో మూడో స్థానాంలో నిలిచారు. సీపీఎం(ఎం) పొందిన 37.88 ఓట్లు అన్వర్ పొందిన ఓట్లతో కలిపితే ఎల్డీఎఫ్ దాదాపు 4.94 శాతం తేడాతో గెలిచేదే.
నీలంబర్ ఉప ఎన్నికల ఫలితాన్ని పరిశీలిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికలు రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ కు హెచ్చరికనే. నిషేధిత పీఎఫ్ఐతో పాటు మతతత్వ సంస్థ రాడికల్ ఇస్లామిస్ట్ జమాత్`ఎ`ఇస్లామీ కాంగ్రెస్కు మద్దతిచ్చాయని, మత శక్తులకు కాకుండా, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి ఓటు వేయాలని సీఎం విజయన్ ప్రచారం చేసినా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. బీజేపీ క్రిస్టియన్కు చెందిన మోహన్ జార్జ్కు టికెట్ ఇవ్వగా, ఆయన 4.91 శాతం ఓట్లతో నాల్గవ స్థానానికి పరిమితమయ్యారు. రాబోయే ఎన్నికల్లో అధికారంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి నీలంబర్ విజయం ఉత్సాహానిచ్చింది.
దేశంలో నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ఏమాత్రం ప్రభావం చూపకపోయినా, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కీలకమైనవే. బీజేపీకి అధికారంలో ఉన్న గుజరాత్లో ఒక స్థానం కోల్పోవడం మైనస్ పాయింటే. విసావదర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొని ఆ స్థానంలో ఓడిపోవడం, అది కూడా అక్కడ పటేదార్ ఉద్యమ నేత ఆప్ నుండి గెలవడం బీజేపీకి భవిష్యత్లో ఇబ్బందులు రావచ్చు. రాష్ట్రంలో ఆప్, కాంగ్రెస్ పార్టీలు జతకడితే బీజేపీకి విజయం అంత సులభం కాదని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్లోని కాళిగంజ్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక 50 వేల ఓట్లతో ఓడిపోవడంతో బీజేపీకి మమతను ఎదుర్కోవడం అంత సులభం కాదని మరోసారి రుజువైంది. పంజాబ్, కేరళలో ఆ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కాబట్టి ఆ రాష్ట్ర ఫలితాలు బీజేపీపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువే.
ఎన్డీఏ కూటమి కంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఈ ఉప ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ‘ఇండియా’ కూటమిలోని పార్టీలన్నీ పొత్తులతో పోటీ చేసే అవకాశాలు లేకపోయినా, గుజరాత్లో పరిస్థితులు మాత్రం భిన్నమైనవి. ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు ఐక్యంగా ఉండి బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను గుజరాత్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే రాష్ట్రంలో బీజేపీ విజయం పరంపరను అడ్డుకునే అవకాశాలుంటాయి. లేకపోతే రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి బీజేపీ నెత్తిన పాలు పోసినట్టే. ఉపఎన్నికలు నష్టపోయిన ఎల్డీఎఫ్తో పాటు ఆప్, బీజేపీ, కాంగ్రెస్, తృణముల్ పార్టీలకు అనేక పాఠాలు నేర్పుతున్నాయని కచ్చితంగా చెప్పవచ్చు.