ఏపీలో కాంగ్రెస్ ఆఫీసులకు తాళాలు?
ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. కోమాలో కొట్టుమిట్టాడుతున్న ఆపార్టీకి జగన్ ప్రభుత్వం బకాయిల రూపంలో ఊహించని ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు, ఆస్తులకు సంబంధించిన బకాయిలు తక్షణమే కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కట్టని పక్షంలో ఆఫీసులకు తాళాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు పంపింది. ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు బకాయిల చెల్లింపు విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. మాకేం సంబంధం లేదు నిధుల సేకరణతో బకాయిలు చెల్లించుకోండని తేల్చిచెప్పింది. దశాబ్దాలుగా పార్టీ పేరుతో పదవులు అనుభవించి.. డబ్బుల సంపాదించిన నేతలు వేరే పార్టీలోకి జంప్ అవడంతో.. తామేందుకు బకాయిలు కట్టాలని ప్రస్తుత పార్టీ నేతలు భావిస్తుండటంతో ఏం జరుగుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఏపీ వ్యాప్తంగా తొమ్మిది జిల్లాలోని( విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు విజయవాడ, గుంటూరు, ఓంగోలు,నెల్లూరు , కడప , కర్నూల్) కాంగ్రెస్ ఆఫీసుల బకాయిలు 1,40,45,942 ( అక్షరాల.. కోటి నలభై లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయలు) కట్టాలని ప్రభుత్వం కాంగ్రెస్ కమిటీకి నోటిసులు జారీ చేసింది. దీంతో పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు.. బకాయిల చెల్లింపునకు ఏఐసీసీ నేతలంతా సహకరించాల్సిన అవసరముందని లేఖ విడుదల చేశారు. సాయం చేయాల్సిన వారు లేఖలో తెలిపిన బ్యాంక్ అకౌంట్ కు తమవంతు సహయాన్ని మార్చి 25 లోగా జమచేయాలని పిలుపునిచ్చారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మీనమేశాలు లెక్కిస్తున్నారు. పార్టీ పేరుతో డబ్బులు సంపాదించుకుని.. పదవులు అనుభవించిన వారికి లేని పట్టింపు .. మాకేందుకు అన్న ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కొత్త అధ్యక్షుడు పీసీసీ రుద్రరాజుకు బకాయిలు చెల్లింపుపై ఏమి చేయాలో అంతుపట్టడం లేదు. అటు అధిష్టానం సహకరించకా.. ఇటు రాష్ట్ర నేతలు తోడుండక దిక్కుతోచని స్థితిలో రుద్రరాజు తలబాదుకుంటున్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది.
2014 లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన నాటినుంచి మంచో చెడో మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తనవంతుగా పార్టీ వ్యవహరాలన్ని చక్కబెట్టేవారు. రాష్ట్రంలో పార్టీకి అన్నితానై వ్యవహరించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ..ఆయన శిష్యుడు రుద్రరాజుకు పెద్దగండంమే వచ్చి పడింది. బకాయిలు కట్టని పక్షంలో పార్టీ ఆఫీసులకు తాళాలు పడితే.. ఉన్న కాస్తా పార్టీ పరువు గంగలో కలుస్తుంది. పార్టీ అధ్యక్షుడిగా ఆనింద ఆయన మోయాల్సి వస్తుంది. దీంతో బకాయిల చెల్లింపు ఆయనకు అగ్నిపరీక్షలా మారింది.
అటు కాకినాడ నుంచి చాలా సంవత్సరాలుగా కేంద్రమంత్రిగా పనిచేసిన పల్లంరాజు పార్టీ విషయాలను పట్టించుకోకపోవడంపై నేతలు మండిపడుతున్నారు. అన్ని బాగున్నప్పుడు పదవులు అనుభవించి, డబ్బుల సంపాదించి.. పార్టీ కష్ట కాలంలో ఉంటే కనీసం స్పందించకపోవడంపై నేతలు గుస్సా అవుతున్నారు. మరో సీనియర్ నేత సుబ్బారామిరెడ్డి సైతం ఈవిషయంలో మౌనం పాటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్లే కాక కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలోకి జంప్ అయిన నేతల తీరుపైన నేతలు మండిపడుతున్నారు. కన్నతల్లిలాంటి పార్టీ కష్టకాలంలో ఉంటే ఆదుకోవాల్సింది పోయి ఏమి పట్టనట్టు వ్యవహరించడం సరికాదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.