అమరావతి: విధ్వంసకర విధానాలతో 5కోట్లమంది భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఇది కేవలం అమరావతి రైతులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, యావత్ రాష్ట్రప్రజల సమస్య, సైకో పాలన అంతంతోనే రాష్ట్రానికి మళ్లీ గతవైభవం చేకూరుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గం రావెల శివార్లలో అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే బాధేస్తోంది… పక్కరాష్ట్రాలను చూస్తే అసూయ కలుగుతోంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం చేపడతాం, రైతులకు చెల్లించాల్సిన కౌలు బకాయిలన్నీ చెల్లిస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం, అది చేసి చూపిస్తాం. కులం, మతం పేరుతో ప్రజారాజధానిపై ముఖ్యమంత్రి విషం చిమ్మారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన రైతులను తీవ్ర ఇబ్బందుల పాల్జేశారు. అమరావతి రైతులను వేధించిన ఏ ఒక్కరినీ వదలం. వారిపై జ్యుడీషియల్ విచారణ జరిపించి ఉద్యోగాలనుంచి తొలగిస్తాం, అవసరమైతే కటకటాల వెనక్కి కూడా పంపిస్తాం. సైకో పాలన అంతంతోనే మళ్లీ రాష్ట్రానికి గత వైభవం చేకూరి అభివృద్ధి బాటలో పయనిస్తుంది. అమరావతి రైతులు అవమానాలు పడ్డారు..లాఠీ, బూటు దెబ్బలు తిన్నారు. ఈ ప్రాంతంలో సీఎం పర్యటిస్తే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. అమరావతి రైతులకు టీడీపీ అండగా ఉంటుంది. నిలిపేసిన పనులు పూర్తి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.
అమరావతిపై 5కోట్లమందిని ఏకతాటిపైకి తెచ్చాం
2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో తెలుసు. దశాబ్ధాలుగా మనం హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే ఇది మీ రాజధాని కాదని కట్టుబట్టలతో గెంటేశారు. విభజన చట్టంలో రాజధాని ఎక్కడో చెప్పలేదు. 5 ఏళ్లు మీరు ఏంచేశారని అన్నారు..5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఓకే రాష్ట్రం..ఒకే రాజధాని..అదే అమరావతి అని అనిపించిన వ్యక్తి చంద్రబాబు. ఆనాడు మోడీ, చంద్రబాబు, జగన్ కూడా జై అమరావతి అన్నారు..అందుకే 3 పంటలు పండే భూమిని 29 వేల మంది రైతులు 33వేల ఎకరాలను రాజధాని కోసం త్యాగం చేశారు. రాజధాని ప్రకటన సమయంలో 13 జిల్లాలకు ఏమేం చేయబోతున్నామో చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే బాధేస్తోంది!
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే బాధేస్తోంది. ప్రతిరోజూ పత్రికల్లో కిడ్నాప్, రేప్, కబ్జాల వార్తలే వస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు, కంపెనీలొస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఫాక్స్ కాన్ సంస్థను శ్రీసిటీలో ఏర్పాటు చేస్తే..దాన్ని కూడా సైకో సిఎం తెలంగాణకు తరిమారు. ఆ సంస్థ రెండో పెట్టుబడి కర్నాటకలో పెడుతోంది. కంపెనీల వారిని ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బంది పెడుతోంది. ఇదా మనం కోరుకున్న రాష్ట్రం? చంద్రబాబునాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ ఆచరణలో చేసి చూపించారు. అనంతకు కియా, చిత్తూరు సెల్ ఫోన్ కంపెనీ, నెల్లూరుకు హీరో, బర్జర్ పెయింట్ కంపెనీ తెచ్చాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫార్మా కంపెనీలు నెలకొల్పాం. విశాఖలో అదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏర్పాటు చేశాం. కియా, ఫాక్స్ కాన్, టీసీఎల్, ఏషియన్ పేపర్ వంటి బడా కంపెనీలు అమరావతికి రాలేదు..ప్రైవేట్ కంపెనీలు అమరావతికి తీసుకురాలేదు.
అభివృధ్ది చేయడం అంత ఈజీకాదు!
ఆరోపణలు చేయడం సులభం..పనులు చేయడం కష్టం. పోలవరంను కూడా 2021 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని చెప్పాడు..దాన్ని కూడా ఇప్పుడు 2025కు పూర్తి చేస్తామని చెప్తున్నాడు. 175 నియోజకవర్గాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా సరిగా చేశారా.? బటన్ నొక్కుతున్నా అంటాడు..నొక్కితే డబ్బులు పడటం లేదు. టీడీపీ వచ్చిన వెంటనే ఆపేసిన అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. జగన్ ఒకటి కట్టలేడు..కట్టేవాడికి అడ్డుపడతాడు..ఛాన్స్ ఇస్తే జేసీబీని పంపిస్తాడు. అమరావతి పనులు ఎక్కడైతే ఆగాయో..అక్కడి నుండే పనులు ప్రారంభిస్తాం.
కులం, మతం పేరుతో అమరావతిపై విషం
ఆనాడు అమరావతికి జై అన్న జగన్…నేడు కులం, మతం పేరుతో విషం కక్కుతున్నాడు. అసెంబ్లీలో జగన్ ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి జైకొట్టాడు, రాజధానికి 30వేల ఎకరాలు ఉండాలన్నాడు. అయితే ఆయన మనస్థత్వం తెలిసిన వారీగా జగన్ గెలిస్తే రాజధాని ఇక్కడ ఉండదని ఆనాడే చెప్పాం. ఇప్పుడు మూడు ముక్కలాటాడుతున్నారు. ప్రపంచంలో వెనుకబడిన సౌతాఫ్రికా లాంటి దేశాన్ని జగన్ ఆదర్శంగా తీసుకున్నాడు. ఆ దేశంలో 32 శాతం నిరుద్యోగిత ఉంది. 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాలి..మూడు రాజధానులన్న వ్యక్తి 3 ఇటుకలైనా వేశాడా? హైకోర్టు విషయానికి వస్తే కనీసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదు. ఇప్పుడు వైజాగ్ ప్రజలను కూడా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోంది. వైసీపీ అధికారిక ట్విట్టర్ లో రిషికొండపై సచివాలయం కడుతున్నారని చెప్పిన 2గంటల్లోనే పోస్టు తొలగించారు. కర్నూలు ప్రజల్ని, అమరావతి రైతులను జగన్ మోసం చేశాడు. విశాఖ ప్రజలు కూడా జగన్ మోసాన్ని గ్రహించాలి.