దేశంలో కోవిడ్ టీకాలు 100 కోట్ల మార్క్ ను దాటిన నేపథ్యంలో.. రాష్ట్రాల వారీగా టీకా వివరాలను సేకరించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి మాండవీయ.. అన్ని రాష్ట్రాల
ఆరోగ్య కార్యదర్శలతో సమావేశం నిర్వహించారు. మరోవైపు దేశంలో దాదాపు 11 కోట్ల మంది కరోనా టీకా రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ లెక్కల్లో వెల్లడైన నేపథ్యంలో.. హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఇంటికి తిరిగి టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
టీకా మొదటి డోసు తీసుకుని..రెండో డోసు తీసుకొని వారంతా సమయం దాటిపోయినా టీకా తీసుకోవడం లేదని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరందరికీ టీకాలు ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నాయి.
ఇక కరోనా టీకాకు అర్హులైన 94 కోట్ల మందిలో 76 శాతం మంది కనీసం ఒక్క డోసు టీకా వేసుకున్నారు. 32 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.టీకా కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు త్వరలోనే హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు మాండవీయ వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలంతా ప్రతి ఇల్లు తిరిగి టీకా అసలు తీసుకోని వారికి, రెండో డోసు తీసుకోవాల్సిన వారికి వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనున్నట్లు వివరించారు.

Posted inNews