‘జగనన్న పాపం పథకం’తో పోలవరం ప్రాజెక్టుకి శాపం: జనసేన నాదెండ్ల మనోహర్
APpolitics: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని పాపం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టిన తీరుకు జగనన్న పాపం పథకం అని పేరు పెట్టాలన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు నెపం కేంద్రం మీద వేస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు మినహా ఈ ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదన్నారు. కేంద్రం నిధులు రీఎంబర్స్ చేస్తామంటే ఎందుకు స్పందించడం లేదో.. 41.5 మీటర్ల ఎత్తుకు ఒప్పుకొని ఎందుకు సంతకాలు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేసుల గురించి మాట్లాడుకోబట్టే కేంద్రం మీ విన్నపాలు ఖాతరు చేయడం లేదన్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ పోలవరంలో పర్యటించి క్షేత్ర స్థాయిలో సాగుతున్న పునరావాసం, నిర్మాణం పనుల గురించి అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. మరింత స్పష్టంగా అక్కడ జరుగుతున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం.. ప్రయోజనాల కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలసి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ బలోపేతం దిశగా జిల్లాల వారీగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. జగనన్న పాపం పథకం పోలవరం ప్రాజెక్టు పాలిట శాపంగా మారిందని వ్యాఖ్యానించారు.
బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో అనేక మంది జాతీయ స్థాయి నాయకులతో చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా ఎలా ముందుకు వెళ్లాలి. వైసీపీ పాలనలో ప్రజల ఇబ్బందులు. పోలవరం ప్రాజెక్టు.. వైసీపీ దాష్టికాలు.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న అంశాలపై కూలంకషంగా చర్చించాం. ముఖ్యంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో సమావేశంలో పోలవరం గురించి పంచుకున్న అంశాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.