సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుండి ఆత్మకూరు మండలంలోని శక్తి కేంద్రాలలో 28 కార్నర్ మీటింగ్ లు నిర్వహించబోతున్నట్లు తేల్చిచెప్పారు. శుక్రవారం బీజేపీ ఆత్మకూరు(S) మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి తెలిసేలా కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆర్టీసీ చార్జీలు , విద్యుత్ చార్జీలు, భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలని సంకినేని హితవు పలికారు.