హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. ఈ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంతటితోనే ఆగకుండా, “నారా లోకేష్‌ను కేటీఆర్ ఎందుకుకలవాలనుకుంటున్నారు ?అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై,” ఉందన్నారు. అంతేకాదు, కేటీఆర్-లోకేష్ మధ్య ఒక్కసారి కాదు, పలు మార్లు రహస్య మంతనాలు జరిగాయి అని ఆరోపించారు సామా. ఈ రహస్య చర్చల వెనుక లబ్ధిదారులు ఎవరన్నదానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
“తెలంగాణ రాష్ట్రం గోదావరి, కృష్ణ నదులపై వాటా కోసం పోరాటం చేస్తుంటే.. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టును ఆపేందుకు చర్యలు కొనసాగుతుంటే.. ఈ తరుణంలో కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో రహస్యంగా సమావేశమవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి?” అని సామా ప్రశ్నించారు.
ఇక “జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితమంతా టీడీపీలోనే సాగింది. ఆ కుటుంబంపై చంద్రబాబుకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అదే కారణంగా ఈ ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు టీడీపీ నేతలను సంప్రదించి ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి”
ఈ పరిణామాల నేపథ్యంలో “జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతును బిఆర్ ఎస్ కోరిందా? కేటీఆర్ ఏం మాట్లాడతారు?” అనే ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.