మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా కూర్చోబోతున్నాడు. బాలాసాహెబ్ శిష్యునిగా శివసేనలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన ఏక్ నాథ్ శిందే సీఎం పదవి చేపట్టబోతున్నారు. హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విధానాలతో విసుగుచెందిన ఆయన.. తిరుగుబాటు ఎగరవేసి మహావికాస్ అఘాడీ కూటమిని కూల్చడంలో శిందే కీలక పాత్ర పోషించారు. బీజేపీ పక్షాన చేరిన ఆయనను.. ఆపార్టీ అధిష్టానం ఊహించని విధంగా సీఎం పదవి కట్టబెట్టింది.
రిక్షావాడి నుంచి సీఎంగా..!
రిక్షా తొక్కితేగానీ పూటగడవని పరిస్థితి నుంచి.. అంచెలంచెలుగా ఎదిగిన ఏక్ నాథే శిందే ప్రస్థానం ఎందరికో ఆదర్శం. 1980 లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ స్ఫూర్తితో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన.. అనతికాలంలోనే పార్టీ లో కీలక నేతగా ఎదిగారు. 1984లో శివసేన కిసాన్నగర్ ప్రాంతానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.1997 లో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.అనంతరం 2004లో ఠాణె నుంచి ..2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో మంత్రిగా వైద్య శాఖ బాధ్యతలు చేపట్టారు.
మహావికాస్ అఘాడీ కూటమికి వ్యతిరేకం..
శివసేనలో కీలక నేతగా పేరుగాంచిన ఏక్ నాథ్ శిందే.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే వైఖరిపై చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా స్థాపించిన.. శివసేన ఆపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఆయనకు బొత్తిగా నచ్చలేదని సన్నిహితులు చెబుతున్నారు.మహావికాస్ అఘాడీ కూటమి ఏర్పడిన సమయంలో శిందే శివసేన సభాపక్ష నేతగా ఎంపికయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం పదవి చేపట్టడం ఆయనను కలిచివేసింది. అంతేకాక ఆదిత్య ఠాక్రేని కేబినెట్లోకి తీసుకోవడం..భవిష్యత్ సీఎం ఆయనే అంటూ పరోక్షంగా ప్రచారాలు చేయించడం పట్ల ఆయన కోపంగా ఉన్నారు. సీఎం ఉద్ధవ్ అనారోగ్యంతో ఉన్న సమయంలో.. అతని స్థానంలో ఠాక్రే భార్య రష్మి, కుమారుడు ఆదిత్య పేర్లు వినిపించడం ఏక్ నాథ్ శిందేకి రుచించలేదు.
చిరాకు తెప్పించిన రౌత్ ఒంటెత్తు పోకడ..
మహావికాస్ అఘాడీ కూటమి ఏర్పడటానికి ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి సంజయ్ రౌత్. అంతేకాక శివసేనలో ప్రధాన హోదాలో ఉన్నారు. పార్టీ తరపున ప్రతివిషయంలో రౌత్ జోక్యం చేసుకోవడం.. ఒంటెత్తు పోకడలతో ఏక్ నాథ్ కి చిరాకు తెప్పించాయి. అంతేకాక ముఖ్య సమావేశాలకు.. చర్చలకు ఏక్ నాథ్ దూరంపెడుతుండటం అతని అసంతృప్తికి ఓ కారణంగా చెప్పవచ్చు. హిందూత్వ భావాజాలానికి అనుకూలంగా స్థాపించబండిన పార్టీ.. అందుకు విరుద్ధంగా నడుచుకోవడంతో.. అతని వర్గం జీర్ణించుకోలేకపోయింది. దీంతో అదను చూసి కోలుకోలేని దెబ్బకొట్టడంతో మహావికాస్ కూటమి కుప్పకూలింది.