Janasenaparty: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరచుకుపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేసి, సీఎం కుటుంబంతో బంధుత్వం కలిగిన ఓ మాజీ మంత్రి ప్రజా వేదికపై బహిరంగంగా తాను మంత్రి పదవిలో ఉన్నపుడు అవినీతి చేశానని ఒప్పుకోవడం వైసీపీ పాలనలో జరుగుతున్న అసలు తంతును బయటపెట్టిందన్నారు . ఆయన ఇప్పటికైనా ప్రజల ముందు బహిరంగంగా తాను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నందుకు అభినందించాలన్నారు. ఆయనే కాదు… ముఖ్యమంత్రి కూడా ప్రజల ముందు చేసిన తప్పులను ఒప్పుకోవాలేని.. తాము మొదటి నుంచి చెబుతున్నట్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సాక్షాత్తూ మాజీ మంత్రులు సంకోచం లేకుండా చెబుతున్నారంటే పాలన ఎలా సాగుతుందో ప్రజలు అర్ధం చేసుకోవచ్చ’ని తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో శ్రీకాకుళంలో జరిగింది.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘ప్రతి శాఖలోనూ అవినీతి ఆకాశమంత పెరిగిపోయిందన్నారు. తవ్వే కొద్దీ అవినీతి జాడలు బయటపడుతున్నాయని..పాలన అస్తవ్యస్తం చేసి, ఇష్టారీతిన వైసీపీ పాలకులు దాష్టీకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ మాజీ మంత్రి తాను పదవిలో ఉన్నపుడు అవినీతికి పాల్పడినట్లు చెబుతున్నారంటే ప్రజా ధనం ఎంత దుర్వినియోగం అవుతుందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. వనరుల దోపిడీని ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకోవచ్చునని మనోహర్ స్పష్టం చేశారు.
పాల వెల్లువ కాదు… పాపాల వెల్లువ
శ్రీకాకుళం జిల్లాకి చెందిన మంత్రి చూస్తున్న పశు సంవర్థక శాఖలో అవినీతి మరో ఎత్తు. 3 లక్షలకు పైగా పాడి పశువులు కొన్నట్లు చూపారని మనోహర్ అన్నారు. వాస్తవానికి కొన్నవి 8 వేలు మాత్రమేనని.. లక్షల పశువులు అంటూ వేల కోట్ల నిధులు బ్యాంకులు నుంచి తీసుకొని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వ్యవస్ధను నిర్వీర్యం చేశారని.. గ్రామ సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధం అని కాగ్ తేల్చిందన్నారు. రూ.3,200 కోట్లు పంచాయతీ నిధులు మళ్లించారని కాగ్ తనిఖీల్లో తేలినట్లు వెల్లడించారు. కాగ్ నివేదికను బయటకు రాకుండా తొక్కిపెట్టారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గట్టు దిగని వారికి రైతుల బాధలెలా తెలుస్తాయి..?
తుపాను ప్రభావంతో ఖరీఫ్ పంట తీవ్రంగా నష్టపోయిందన్నారు మనోహర్. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి పంట వచ్చే సమయంలో తుపాను విరుచుకుపడిన వేళ అన్నదాతకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి.. కనీసం వారిని పలకరించిన పాపాన పోలేదన్నారు. నష్టపోయిన పంటను పొలం గట్టు వరకు దిగి పరిశీలించలేదని.. పంట పొలాల దగ్గర వేదికలను ఏర్పాటు చేసుకొని పంటను పరిశీలిస్తే ఏం తెలుస్తుందని అన్నారు. రైతన్న గుండె బాధ ఎలా అర్ధం అవుతుందా? అని ప్రశ్నించారు. పంటల బీమాను పూర్తిగా నాశనం చేసి, ఆపత్కాలంలో రైతుకు మొండి చేయి చూపించిన ఈ ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా మోసం చేసిందని మనోహర్ దుయ్యబట్టారు.