తొలి వన్డేలో భారత్ శుభారంభం!

శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. కొలొంబో వేదికగా లంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్, అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్.. అర్ధ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా 2, లక్షన్ సందకన్ ఒక వికెట్ తీసుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు చేసింది. అనంతరం 263 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. . యువ ఓపెనర్ పృథ్వీ షా(43; 24 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. తొలి వికెట్కు ధావన్తో కలిసి కేవలం 5.3 ఓవర్లలోనే 58 పరుగులు జోడించింది ఈ జంట. ప్రమాదకరంగా మారుతున్న పృథ్వీని ధనంజయ విడగొట్టాడు.
చెలరేగిన బర్త్ డే బాయ్ ఇషాన్:
పృథ్వీని ఔట్ చేశామన్న ఆనందం లంక ఆటగాళ్లకు ఎంతో సేపు నిలువలేదు. వన్డౌన్గా క్రీజులోకి వచ్చిన బర్త్డే బాయ్ ఇషాన్.. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్స్, ఫోర్గా మలిచా ఎదురుదాడి మొదలెట్టాడు. ఈ క్రమంలో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రెండో వికెట్కు ధావన్తో కలిసి 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇందులో కిషన్వే 59 రన్స్ కావడం విశేషం.

ధావన్ రికార్డ్…
మొదట్లో ఆచితూచి ఆడిన కెప్టెన్ ధావన్(94 బంతుల్లో 86 పరుగులు).. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత బ్యాట్ ఝళిపించాడు. కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడిగా నిలిచాడు. దీంతో పాటు లంకపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మన్గానూ ఫీట్ సాధించాడు.