Nancharaiah merugumala senior journalist:
నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు!
తాటిపాముల, ఇనుపాముల, అయిటిపాముల, వానపాముల, కలవపాముల
1982 నుంచీ గుడివాడ – హైదరాబాద్ మార్గంలో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దగా ఎవరికీ పట్టని నాకిష్టమైన ఒక విషయం నేను గమనించాను. గుడివాడ నుంచి బెజవాడకు వెంట్రప్రగడ, మానికొండ, కంకిపాడు మీదుగా ఎక్కువ భాగం కృష్ణా నది కాలవ పక్కన రోడ్లపై పోతుంటే… వెంట్రప్రగడ లోపు ‘వానపాముల’ అనే గ్రామం వస్తుంది. తర్వాత వెంట్రప్రగడ నుంచి మానికొండ పోతుంటే దారిలో ‘కలవపాముల’ అనే ఊరొస్తుంది. ఇలా ‘పాముల’ అనే మాటతో ముగిసే ఊళ్ల పేర్లు కృష్ణా జిల్లాలో అదీ దాని తూర్పు ్రçపాంతంలోని కాలవల పక్క ఎందుకున్నాయి? అని అనుకునేవాణ్ణి. ఈ రెండు గ్రామాలూ 1940లు, 50ల నాటి ఆంధ్రా కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతంగా సాగిన ప్రాంతంలో ఉన్నాయి. కాలవలు, వర్షాలు కాస్త ఎక్కువే కావడంతో నిజంగా ఈ గ్రామాల్లో నీటిపాములు, బురదపాముల నుంచి తాసు పాముల వరకూ ఉంటాయి. వానపాముల గ్రామానికి చెందిన ప్రముఖులు చాలా మంది ఉన్నారని విన్నాను. సాక్షి దినపత్రికాఫీసు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్నప్పుడు బారా నంబర్ కమాన్ దగ్గర రోడ్డు పక్కనే వెల్లంకి ఫుడ్స్ బ్రాంచి ఉండేది 2007–2012 ప్రాంతంలో. దాని బోర్డు మీద వెల్లంకి ఫుడ్స్ పేరు కింద ‘తెలుగుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య బంజారాహిల్స్ బ్రాంచ్’ అని రాసి ఉంటే నేను కిలో స్వీట్లు తీసుకుని నా గుడివాడ మిత్రుడు ప్రసాద్ ఇంటికెళదామనుకుని ఆ షాపులోకి వెళ్లాను. దాదాపు 75–80 ఏళ్ల వయసున్న ఈ గొలుసుకట్టు మిఠాయి షాపుల యజమానిని, ‘ ఈ బ్రాంచ్ పేరు సుందరయ్య గారితో ఉందేంటి? మీరు ఎప్పుడైనా కమ్యూనిస్టులా?’ అని అడిగాను. ‘‘ లేదండీ. నేను పదిహేను సంవత్సరాల వయసులో ఉండగా మా ఊరు వానపాములకు కమ్యూనిస్టు దిగ్గజం సుందరయ్య గారు వచ్చారు. అప్పుడు నా గొంతు బాగుందని నాతో ప్రజానాట్యమండలి వారు పాట పాడించారు. అలా కొన్నేళ్లు ప్రజానాట్యమండలిలో తిరుగుతూ కమ్యూనిస్టు పాటలు పాడేవాడిని. పెద్దగా చదువుకోలేదు నేను. కమ్యూనిస్టు సిద్ధాంతాల లోతు తెలీదు. అయినా, ప్రపంచజ్ఞానం, వ్యాపారం చేసేంతటి విషయ పరిజ్ఞానం ప్రజానాట్యమండలిలో తిరగడం వల్లే వచ్చిందనుకుంటాను. కమ్యూనిస్టులకు సానుభూతిపరుడిగా 60 ఏళ్లకు పైగా ఉంటున్నాను,’’ అని ఆయన వివరించారు. ఆయన పేరు అడిగి తెలుసుకున్నాగాని ఇప్పుడు అది గుర్తులేదు. ఇలా వానపాముల పేరు చూడగానే వెల్లంకి ఫుడ్స్ పేరు గుర్తొస్తుంది. కృష్ణా జిల్లాలో చాలా ముందుగా ఉన్నత పాఠశాలలు స్థాపించిన పునాదిపాడు, మంతెన వంటి గ్రామాల జాబితాలో ఈ వానపాముల కూడా చేరుతుంది.
కలవపాముల దాసరి పద్మగాని కుటుంబం సొంతూరని తెలిసింది
బెజవాడ కృష్ణా బరాజ్ నుంచి తవ్విన మూడు పెద్ద కాలవల్లో ఒకటైన ‘రైవస్ కాలువ’ బ్రాంచి కాలవపై చిన్నపాటి లాకులు అమర్చిన గ్రామం కలవపాముల. ’రైవస్ అంటే బ్రిటిష్ ఇంజినీరు అని విన్నా) ఇది కమ్యూనిస్టు ఊరేగాక, కమ్మటూరని తర్వాత తెలిసింది. ఈ ఊరు నుంచే ప్రసిద్ధ సినీ దర్శకుడు, ఉదయం తెలుగు డైలీ స్థాపకుడు దాసరి నారాయణ రావుగారి భార్య పద్మగారి కుటుంబం ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెళ్లి స్థిరపడిందని చెప్పారు. పెళ్లికి ముందు ఆమె కుటుంబం ఇంటిపేరు వెల్లంకి అని కూడా తెలిసింది. పైన చెప్పిన వెల్లంకి ఫుడ్స్ యజమానికి పద్మ గారి కుటుంబానికి బంధుత్వం ఉన్నదీ లేనిదీ నాకు తెలియదు.
ప్రసాద లాబ్స్ మాజీ ఉద్యోగి, అప్పుడప్పుడూ తెరపై హఠాత్తుగా దర్శనమిచ్చే సినిమానటుడు వెల్లంకి నాగినీడు కూడా కలవపాముల గ్రామానికే చెందినవాడని తెలిసింది.
కృష్ణాలో రెండు, నల్గొండ జిల్లాలో మూడు ‘పాముల’ గ్రామాలు
రెండు వేర్వేరు ప్రాంతాలు లేదా ఒకప్పుడు, ఇప్పుడు రెండు భిన్న రాష్ట్రాలకు చెందిన కృష్ణా, నల్గొండ జిల్లాలు సరిహద్దు జిల్లాలు. అంతేకాదు, స్వాతంత్య్ర ఉద్యమం కాలం నాటి కమ్యూనిస్టు ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీల ఎదుగుదల, సామాజిక ప్రగతిశీల ఉద్యమాలు, రాజకీయ చైతన్యం విషయంలో ఈ రెండింటికీ లెక్కలేనన్ని పోలికలున్నాయి. ‘పాముల’ అనే మాటతో ముగిసే గ్రామాల విషయంలో నల్గొండ కాస్త ముందుంది. విజయవాడు–హైదరాబాద్ జాతీయ రహదారిలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాముల అనే మాటతో మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాల మీద నుంచి బస్సులోనో లేదా కారులోనో పోతుంటే వెంటనే నాకు కృష్ణా జిల్లా గ్రామాలైన వానపాముల, కలవపాముల గుర్తుకొచ్చేవి. ఈ హైవేలో ఏ ‘పాముల’ గ్రామం ముందు. ఏది మధ్యలో, ఏది చివర వస్తుందో గర్తు లేదు గాని ఇప్పటి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించగానే తాటిపాముల, ఇనుపాముల, అయిటిపాముల అనే మూడు గ్రామాలు వస్తాయి. రెండు ప్రాంతాల మధ్య పూడ్చలేనన్ని తేడాలు ఉన్నాయని నాటి తెలంగాణ ఉద్యమకాలంలో ఎందరో చెప్పేవారు. అయినా కోస్తా, తెలంగాణ ప్రాంత సరిహద్దుజిల్లాలైన నల్గొండ, కృష్ణా జిల్లాల జనాన్ని కమ్యూనిస్టు పార్టీలు గతంలో, ‘పాముల’ పేరుతో ముగిసే మూడు గ్రామాలు ఎప్పటికీ కలిపే ఉంచుతాయనే ఆశ నాలో ఎన్నటికీ బతికే ఉంటది.
‘ఈనాడు’లో రాష్ట్ర మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి, బీఎచ్‌ఈఎల్ పూర్వ జనరల్ మేనేజర్ పురుషోత్తం రెడి (90)్డ గారి మరణ వార్త చదివినప్పుడు ఆయన సొంతూరు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల అని పొద్దున చూడగానే నా పాత జిల్లా కృష్ణాలోని రెండు ‘పాముల’ గ్రామాలు వానపాముల, కలవపాములతోపాటు తెలంగాణ కిందికి వచ్చే అయిటిపాముల, ఇనుపాముల గుర్తుకొచ్చాయి. నా దృష్టిలో కృష్ణా, నల్గొండ జిల్లాల మధ్య సాంస్కృతిక బంధాన్ని పెంచే ఈ ‘పాముల’ గ్రామాల గురించి ఎప్పటి నుంచో రాయాలనుకున్న ఆలోచనను ఇప్పుడు అక్షరాల్లో పెట్టగలిగాను.
* మరో ఆసక్తికర విషయం ఏమంటే… కృష్ణా జిల్లాలో ‘ తరిగొప్పుల ‘ అనే రైల్వే స్టేషన్ ఉన్న ఊరుంది. ఇదే పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద గ్రామం నర్మెట్ట మండలంలో ఉంది.
ఫోటోలు: ఉత్తమ్, పురుషోత్తం, నాగినీడు, దాసరి పద్మ