తెలంగాణలో బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. ఆపార్టీలోకి చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. ప్రధాని మోదీ సమక్షంలో ఆపార్టీలో చేరనున్నట్లు ప్రకటించాడు.అధికార టీఆర్ ఎస్ ఎదుర్కొవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని.. అందుకే బీజేపీలో చేరుతున్నానని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు నల్గొండ, ఖమ్మంతో పాటు పలుజిల్లాలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ప్రధాని మోదీ , కేంద్రమంత్రులు , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ అగ్రనేతలు సమావేశాలకు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో బీజేపీలోకి వలసల పర్వం మొదలైంది. మాజీ ఎంపీకొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇప్పటికే బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించాడు. అతనితో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం ఆపార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చేరికకు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అధికార టీఆర్ ఎస్ ను ఢీకొట్టాలంటే.. అది బీజేపితో మాత్రమే సాధ్యమని కొండా అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులుకుప్పగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రం పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. టీఆర్ఎస్.. ఉద్యమకారులను పక్కపెట్టారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోయిందని .. అందుకే బీజేపీ లో చేరుతున్నట్లు కొండా స్పష్టం చేశారు.
ఇక విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు గుంబనంగా ఉన్నప్పటికి .. అదును చూసి దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఉద్యమకాలంలో.. ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని.. కేసీఆర్ పదవులను కట్టబెట్టారన్న భావన వారిలో ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లను పట్టించుకోవడం లేదని..రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపేందుకు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంమీద అటు రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, పార్టీలో గుర్తింపుకు నోచుకోని నేతలంతా ఒకే రకమైన పంథాతో ముందుకు సాగుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి..ఆయా జిల్లాలోని అభ్యర్థుల విజయవకాశాలను ప్రభావితం చేయనున్నారు.