అమ్మాయిల పెళ్లి విషయంలో కేంద్రం కీలక నిర్ణయం!

అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు 18ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలన్న చట్టం ప్రస్తుతం ఉండగా.. దానిని 21ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. వివాహ వయసు విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా తొలగించాలన్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం దేశంలో కనీస వివాహ వయసు అబ్బాయిలకు21ఏళ్లు, అమ్మాయిలకు 18ఏళ్లుగా ఉంది. దీనిపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తాయి.
అటు బిడ్డలను కనేందుకు సముచితమైన వయసు, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, పోషకాహార స్థాయుల మెరుగుదల, సంబంధిత ఇతర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం… జయ జైట్లీ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించింది. వాటన్నింటినీ పరిశీలించి ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది.
కాగా అమ్మాయిలు తొలి సారి గర్భం దాల్చేనాటికి వారి వయసు కనీసం 21ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. అంతేగాక, అమ్మాయిలకు 21ఏళ్లకు వివాహం చేయడం అది ఆ కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్య పరంగా సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా త్వరలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాల్లో సవరణలు తీసువచ్చేలా కేంద్రం సమాయత్తమవుతోంది.

Optimized by Optimole