కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏపని తలపెట్టిన అరకొరగానే ఉంటుందనడానికి కరోనా కట్టడి చర్యలే నిదర్శనమని అన్నారు. సూర్యాపేటలో సోమవారం జరిగిన కబడ్డీ పోటీల ప్రమాదాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. నిర్వహణ లోపంతో పాటు అక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ చేపట్టలేదని.. గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యారని అన్నారు. అధికారులకు సరైన మార్గదర్శకాలు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పరిస్థితుల్ని చూసైనా తెలంగాణ సర్కారు మేలుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు.