Hyderabad:
హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) – సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఇటీవల చోటుచేసుకున్న టికెట్ల వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు సంఘంలోని ఇతర అధికారులను రాష్ట్ర సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గత ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్ల టికెట్ల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తం చేసిన SRH యాజమాన్యం, విఐపి బాక్సులకు హెచ్‌సీఏ తాళం వేసినట్టు ఆరోపించింది. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన SRH యాజమాన్యం, “హైదరాబాద్ వదిలి వెళ్లాల్సి వస్తే వెళ్తాం” అని హెచ్చరిక జారీ చేసింది.
ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, SRH ఫ్రాంఛైజీపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.
ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి నివేదికను ప్రభుత్వం ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఇదే సమయంలో హెచ్‌సీఏ పరిపాలన విధానంపై సైతం పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.