ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తు.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ఇక సీఎం యోగి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తుండటంతో .. తన మానస పుత్రిక హిందూ యువవాహిని ఆయన గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకుంది. ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్‌పుర్ మఠాధిపతిగా యోగి స్థాపించిన ఆసంస్థ.. గత కొన్నేళ్లుగా నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు గోరఖ్‌పుర్ పట్టణ నియోజకవర్గం అభ్యర్థిగా యోగి పేరును ప్రకటించగానే ఈ యువ వాహిని సభ్యులంతా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. బూత్ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక నేతలతో కలిసి పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ యోగికి మద్దతుగా ప్రచారం చేస్తూ.. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు.
అటు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పై ఫైర్ అయ్యారు. ఎన్నికల టైంలో అఖిలేశ్ యాదవ్ జోకులేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. తన సైకిల్‌కు పంక్చర్ అయిందని.. అది బీజేపీయే చేసిందంటున్నారని ఎద్దేవ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అఖిలేశ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓడిపోబోతున్నామనే నైరాశ్య భావన అఖిలేశ్‌కు ఉందన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అంటే నేరగాళ్ళు, గ్యాంగ్స్టర్ల పార్టీ అని మండిపడ్డారు. ఇటువంటి నేరగాళ్ళ మద్దతుతో ప్రజా సంక్షేమానికి పాటుపడతామని ఆ పార్టీ హామీలిస్తోందని దుయ్యబట్టారు.