విద్యాదాత మల్లన్నకే ఇన్ని కష్టాలు.. బక్కరెడ్లు, బడుగు రెడ్లు ఎలా బతకాలి?

Nancharaiah merugumala: 

………………………………………………..

కొన్ని దశాబ్దాల క్రితం బర్రెలను మేపుతూ, పేడ ఎత్తుకుంటూ, పాలు పితికారు తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి చామకూర మల్లా రెడ్డి. తనలాగే పాలూ, పెరుగు అమ్ముకునే దోస్తు దుర్గయ్య యాదవ్ తో కలిసి మొదట బోయినపల్లిలో చదువుల వ్యాపారం లోకి దిగారు. క్రైస్తవులు నడపలేకపోతున్న హై స్కూలును కొని గాడిలో పెట్టారు. తరవాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి నాలుగు రాళ్లు కూడబెట్టారు. తెలుగు పాత్రికేయులు సహా తనకు సాయపడిన సామాన్యులందరినీ మరిచిపోలేదు.

కాగా మల్లారెడ్డి పాల వెల్లువ నుంచి విద్యా వ్యాపారంలోకి పోయాక అక్కడ ఆగిపోతే బాగుండేది. అనవసరంగా మల్కాజిగిరి ఎంపీగా పార్లమెంటులో అడుగుబెట్టారు. తెలంగాణ జనాన్ని తన మాదిరిగా బాగుచేయడానికి అసెంబ్లీ సభ్యుడయ్యారు. వద్దనుకున్నా మంత్రి అయ్యారు. పుట్టిన నేలను మరచిపోలేని మల్లన్న పెద్దగా సదువు లేకున్నా అమ్మమ్మ ఊరు గండి మైసమ్మ- దూలపల్లి-కొంపల్లి ప్రాంతంలో కళాశాలలు పెట్టి చక్కగా నడుపుతున్నారు. ఆ మధ్య తన జిల్లాలోని రెడ్డి కుల సంఘం సభకు పోతే గిట్టని సొంత రెడ్లే మల్లారెడ్డి గారిని అవమానించారు. అయినా, బాధ దిగమింగుకున్నారు.

ఇక కాంగ్రెస్ నేత ఏ రేవంత్ రెడ్డి నుంచి ఎందరో రెడ్లు, ఇతర కులాలోళ్లు ఆయనకు శత్రువులయ్యారు. సరస్వతీ సేవలో తరించకుండా అనవసరంగా తెలంగాణ జనం సేవకు వచ్చి కష్టాలపాలవుతున్నారు మల్లన్న. నిన్నటి ఆదాయపన్ను శాఖ దాడులు, సోదాలు సమయంలో ఆయన కొడుకు మహేందర్ రెడ్డిని సీఆర్పీఎఫ్ జవాన్లు కుళ్లబొడిచి, చిత్రహింసలు పెట్టారంటే ఇక తెలంగాణాలో సామాన్యుడు బతికేదెట్లా? 8 ఏళ్ల క్రితం ఆంధ్రోళ్ల వలస పాలన నుంచి విముక్తిపొందిన కొత్త రాష్ట్రం తెలంగాణలో మల్లారెడ్డి వంటి మామూలు రెడ్లకు, ఇతర మనుషులకు పౌర, మానవ, రాజ్యాంగ హక్కులు ఉండవా? రెడ్డి ముఖ్యమంత్రి లేని తెలంగాణలో కాస్త సంపాదించుకున్న మల్లారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి వంటి అసలు సిసలు రెడ్లు-పొరుగున ఉన్న మరో తెలుగు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు వలసపోవడం ఒక్కటే మార్గమా? తొలి తెలంగాణ రెడ్డి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి చిన్నబ్బాయి శశిధర్ రెడ్డి గారే బీజీపీలో చేరి ప్రాణాలు కాపాడుకునే స్థితికి వచ్చారంటే- ఇక పేద, బక్క, దిగువ మధ్య తరగతి రెడ్ల పరిస్థితి ఏంటి? ఈ విషయాలపై రెడ్ల ఆత్మబంధువు రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సీరియస్ గా మాట్లాడాలని తెలుగు బహుజనులందరూ కోరుకుంటున్నారు.