Newsminute24

Hyderabad: కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాయాలి: సీఎం రేవంత్

షేక్‌పేట్ డివిజన్, పారా మౌంట్ కాలనీ:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంటా లేక డెవలప్మెంటా అన్నది ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కి లేదని విమర్శించారు. “పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నాడు. అదే కేసీఆర్ ఇప్పుడు పీజేఆర్ కుటుంబంపై సెంటిమెంట్ రేపడానికి ప్రయత్నిస్తున్నాడు. పీజేఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకరచి క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.“ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. మా ప్రభుత్వం లో హిందూ, ముస్లిం అందరూ సమానమే ఎలాంటి తారతమ్యం లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్ సమస్యలకు బీజేపీ, బీఆర్‌ఎస్ బాధ్యత వహించాలన్నారు.“బీఆర్‌ఎస్ నాయకులు బెంజ్ కార్లు వదిలి ఆటోల్లో తిరుగుతూ సమస్యలు వింటున్నట్టు నాటకం చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.మూడు నెలల్లోనే జూబ్లీహిల్స్‌లో ₹400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించామని రేవంత్ వెల్లడించారు. “నవీన్ యాదవ్ గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి వేగవంతమవుతుంది. 10 ఏళ్లలో కేసీఆర్ ఏమీ ఇవ్వలేదు, ఇప్పుడు ఎలా ఓటు అడుగుతాడు?” అని ప్రశ్నించారు.ప్రస్తుతం 2.39 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, త్వరలో 4000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కాళేశ్వరం అవినీతి విచారణపై మాట్లాడుతూ, “సీబీఐ దర్యాప్తు కోరినా మోదీ పట్టించుకోవడం లేదు. కేసీఆర్, కేటీఆర్‌లను బొక్కలో వేయమని అడిగితే మౌనంగా ఉన్నాడు కిషన్ రెడ్డి” అని విమర్శించారు. కిషన్ రెడ్డి మూసీ నది అభివృద్ధికి, త్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు.

“వైట్ ఛాలెంజ్ విసిరి కేటీఆర్ పారిపోయాడు.కంటోన్మెంట్‌లో ₹4000 కోట్ల పనులు జరిగాయని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అన్న కేటీఆర్, 5000 కోట్ల జీఓలు చూపించగానే పారిపోయాడు. కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు” అని తీవ్రంగా హెచ్చరించారు.

నవీన్ యాదవ్ విజయం కోసం ఎంఐఎం నేతలు కష్టపడి పనిచేస్తున్నారు. ఎంఐఎం మొదట నవీన్ యాదవ్‌కే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 30 వేల మెజార్టీతో ఆయన గెలవడం ఖాయం” అని విశ్వాసం వ్యక్తం చేశారు.ముస్లింలకు ప్రాధాన్యం కల్పించామని గుర్తుచేసి, “సిరాజ్‌కు డీఎస్పీ అవకాశం ఇచ్చాం, నికత్ జరీన్‌ను కూడా డీఎస్పీగా నియమించాం, అజరుద్దీన్‌ను మంత్రిని చేశాం. ఆయన మంత్రి అయ్యారంటే కిషన్ రెడ్డి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు?” అని ప్రశ్నించారు.

లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపిస్తూ, “బీఆర్‌ఎస్ సహకారం లేకుండా మోదీకి ప్రధాని అవ్వడం సాధ్యం కాదు” అన్నారు.“జూబ్లీహిల్స్‌లో మోదీ–కేసీఆర్ ఒకవైపు, రాహుల్ గాంధీ–రేవంత్ రెడ్డి–అసదుద్దీన్ మరోవైపు. నవీన్ యాదవ్ 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయం” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version