Telangana: నేతలు మారకుంటే… కాంగ్రెస్ కు కష్టాలే..!!

IncTelangana:

తెలంగాణలో కాంగ్రెస్ ఇవాళ నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది. పయనం ఎటు? మెరుగైన స్థితికా? పతనానికా? అన్నది పార్టీ రాష్ట్ర నాయకత్వం చేతిలో ఉంది. అధికారంలో ఉన్నపుడు సంస్థాగతంగా-రాజకీయంగా పార్టీని ప్రజాక్షేత్రంలో పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ఇరువురిపైనా ఉంటుంది. జోడు గుర్రాల్లా సమన్వయంతో రాష్ట్ర కాంగ్రెస్ రథాన్ని ముందుకు నడపాల్సిన ఈ ఇద్దరి వ్యవహారశైలీ… అటు అధిష్టానానికి ఇటు కార్యకర్తల శ్రేణికి ఎవరికీ నచ్చుతున్నట్టు లేదు. అంతా బాగున్నట్టే పైకి కనిపిస్తున్నా లోలోపల డొల్లతనం మెల మెల్లగా బయటకు వస్తోంది. ఇటీవలే రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాటలే ఇందుకు నిదర్శనం! ఎందుకీ పరిస్థితి? పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తయిన తరుణంలో వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి ఒక పరీక్షా కాలమే! దాదాపు సగం మంది మంత్రుల నియోజకవర్గాల్లో పార్టీ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నట్టు సర్వే నివేదికలు చెబుతున్నాయి. బీసీ రిజర్వేషన్ సవాళ్లు, న్యాయ చిక్కులు దాటి ఎన్నికలు జరిగేనాటికి… ముఖ్య నేతలు తమ పనితీరు మార్చుకొని కుదురుకుంటే ఒక లెక్క, లేదంటే మరో లెక్క! ఇదీ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల కేంద్ర నాయకత్వం సంతృప్తిగా లేదు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ ఉండాల్సిన పద్దతి, లక్షణాలు, సమన్వయం, కార్యశీలత తెలంగాణలో లోపించాయని అధిష్టానం తలపోస్తోంది. ఈ పద్దతి ఇలాగే కొనసాగితే, చాలా తక్కువ సమయంలోనే కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల ఆదరణే కాకుండా ప్రజాదరణను కూడా పార్టీ కోల్పోవాల్సి వస్తుందని నాయకత్వం హెచ్చరించింది. వీలయినంత తొందరగా పనితీరు మార్చుకొని, పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఒకింత ఘాటుగానే రాష్ట్ర ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేసింది. పార్టీలో భిన్న వైఖరులు, విభిన్న స్వరాలు లేవని, అందరం ఒకే ఆలోచన, ఒకే లక్ష్యంతో సంఘటితంగా పనిచేస్తున్నామనే భావన కలిగించాలని ఆదేశించింది. పార్టీ నాయకులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, చర్యలు చేపట్టాడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ది-సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ క్రియాశీలంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యనేతలకు ఉద్భోదించారు. పార్టీ ‘రాజకీయ వ్యవహారాల సంఘం’ (పీఏసీ) సమావేశంలో, ఆంతరంగిక భేటీలో ఖర్గే, పార్టీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ లు నుడివిన మాటల్ని, నిర్దిష్టంగా చేసిన వ్యాఖ్యల్ని విశ్లేషిస్తే అధిష్టానం అసంతృప్తి స్పష్టమౌతోంది. సుతిమెత్తని మందలింపే అయినా రాష్ట్ర నాయకులకు బోధపడేలా ఘాటైన సందేశమిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, పీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్ లను ఉద్దేశించి కూడా నిర్దిష్ట వ్యాఖ్యలు చేశారు.

కుదురుకోని పీసీసీ

ముఖ్యమంత్రి మాటతీరు అధిష్టానానికి నచ్చనట్లే, పీసీసీ పనితీరు ముఖ్యమంత్రికీ నచ్చట్లేదనే విషయం ఈ సందర్భంగా స్పష్టమైంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత పది నెలలకు గాని పీసీసీ రాష్ట్ర కార్యవర్గం రాలేదు. ఇటీవలే ఏర్పడ్డ రాష్ట్ర కార్యవర్గం ఇప్పుడిప్పుడే పని ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరేం మాట్లాడినా చెల్లుబాటవుతోందని, పీసీసీ అధినేతకు ఆయా గొంతులపై ఎటువంటి నియంత్రణ లేదనే భావన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని, ఆయన చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. పీసీసీ అధినేత, పార్టీ వ్యవస్థపై ఇంకా పట్టు సాధించాలని ఆయన కోరుకుంటున్నట్టుంది. తమ అధ్యక్షుడి పనితీరు ‘భూమి కౌలుకిచ్చి ఇక ఏమీ పట్టించుకోని యజమాని’ (ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్) లా ఉందని ఆయనొక వ్యాఖ్య చేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ నాయకత్వంలో, ప్రభుత్వంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కోవర్టులున్నారంటూ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవల చేసిన వ్యాఖ్య పార్టీలో దుమారమే రేపింది. ఒక ఎమ్మెల్యే, ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకాలను, పరోక్షంగా కొందరు మంత్రుల అవినీతి-అక్రమాలను ఎండగట్టడానికి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇప్పటికే డజన్కు పైగా దరఖాస్తుల్ని దాఖలు చేసినట్టు సమాచారం. నగరంలోని విలువైన ఒక భూదందాలో జరిగిన అక్రమాలపై తామే ఫిర్యాదు చేసినా… ప్రభుత్వ శాఖలు గాని, ‘హైడ్రా’ వంటి ఎజెన్సీలు గానీ చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహించిన పార్టీ ఎమ్మెల్యేలు కొందరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) వేశారు. ఎమ్మెల్యేలదే ఈ పరిస్థితి అయితే సామాన్యుల సంగతేమిటని పార్టీలోని వారే ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ స్థూలంగా పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల్లో దురభిప్రాయం కలిగిస్తాయని పార్టీ శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.

గట్టి ఫిర్యాదులే లెక్క..

కాంగ్రెస్ లో అంతర్గత ఫిర్యాదులు కొత్త కాదు. పీఠంపై ఎవరున్నా అసంతుష్టుల ఫిర్యాదులు వస్తుంటాయి. గిట్టని నాయకత్వంపైన సమ ఉజ్జీలు, కిందిస్థాయివారు… ఇలా ఎవరెవరో అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం కాంగ్రెస్లో మామూలే! అన్ని ఫిర్యాదుల్ని అధిష్టానం పరిగణనలోకి తీసుకోదు, వాటిని సదరు నాయకుల దృష్టికి తీసుకురాదు. నమ్మదగిన, సహేతుకమైన, నిర్దిష్ట ఆధారాలున్న ఫిర్యాదుల్ని మాత్రం నాయకత్వం అంత తేలిగ్గా తీసిపారేయదు. సందర్భం వచ్చినపుడు ఆయా నాయకుల్ని నేరుగా ప్రశ్నించి, విషయం ఏంటో తెలుసుకుంటుంది, అవసరమైతే తేల్చుకుంటుంది. తీరు మార్చుకోమని చెబుతుంది, సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. లోగడ కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఫామ్ హౌజ్ నుండి పాలన సాగించారని విమర్శించిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు అవే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి కేబినెట్ సమావేశాలకు మాత్రమే వస్తూ, మిగతా సమావేశాలను బంజారాహి ల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే ఏర్పాటు చేస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. రాష్ట్ర పార్టీ అధినేత జిల్లాల పర్యటనల కన్నా విదేశాలు, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల పర్యటనలు పెరిగాయనే షికాయతులు కూడా పై స్థాయి వరకు వెళ్లాయి. ఉన్నప్పుడైనా గాంధీభవన్ లో కుదురుగా కూర్చోరని, అంతకన్నా అధిక సమయం మంత్రుల వద్దో, కార్పొరేషన్ చైర్మన్లతోనో, ఇతర కార్పొరేట్లతోనో గడుపుతారనే ఫిర్యాదులూ వచ్చినట్టు ఢిల్లీ పెద్దల మాటల్నిబట్టి స్పష్టమౌతోంది. ‘మీ వ్యవహారం ఇలాగే కొనసాగితే, చివరకు మీ నెత్తినే కొబ్బరికాయ కొట్టే పరిస్థితి వస్తుంది’ అని ఢిల్లీ పెద్ద పీసీసీ అధినేతతోనే అన్నారంటే, ఫిర్యాదుల్ని అధిష్టానం ఎంత సీరియస్గా పరిగణిస్తోందో ఇట్టే అర్థమవుతోంది.

అధిష్టానం నోటి వెంటా అదే మాట!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే కొన్ని వ్యాఖ్యలు, ఉపయోగించే భాష పట్ల తరచూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షంలో ఉన్నపుడు చెల్లుబాటయిందేమో కాని, ‘సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉండి అలా మాట్లాడొచ్చా?’ అన్నది ప్రజాక్షేత్రంలో చర్చ లేవనెత్తుతోంది. అవతలి వారిని విమర్శించేప్పుడు సీఎం వాడే భాష, చేసే విపరీత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి హోదాను తగ్గించేవిగా ఉండటమే కాక ప్రత్యర్థులకు అయాచితంగా అస్త్రాలిచ్చినట్టవుతోందని స్వయంగా ఖర్గేనే తప్పుబట్టినట్టు తెలిసింది. ఖజానా ఖాళీ, అప్పు పుట్టట్లేదు వంటి నిస్సహాయపు మాటలు కూడా సరికాదని, అశోక్ సామ్రాట్ ను ఉటంకిస్తూ ఓ మాట చెప్పారాయన. ‘బుద్దం శరణం గచ్చామి’ అన్నది అశోకుడి నినాదమే అయినా, తప్పనపుడు ఆయన కళింగ యుద్దానికీ సిద్దమయ్యార’నే విషయాన్ని గుర్తు చేశారు. ఇంకో మాట కూడా చెప్పారు. ‘ఎంతో కఠోర శ్రమ, దీక్షతో మీరు మీ ఆశయాన్ని నెరవేర్చుకొని ముఖ్యమంత్రి అయ్యారు, మరి కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమపడిన పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తల ఆశలు, ఆశయాలు, అభీష్టాలు కూడా నెరవేరాలి కదా? అందుకు ప్రభుత్వాధినేతగా మీరు, పార్టీ అధినేతగా పీసీసీ చీఫ్ సహకరించాలి కదా?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా, ఆయన తననే ఒక ఉదాహరణగా చెప్పారు. ‘ఈ వయసులో కూడా నేను ఎప్పుడూ నిరాశ- నిస్పృహల్ని దరి రానీయను, పార్టీకి, కార్యకర్తలకు ఏం చేయగలమనే ఆలోచిస్తాను’ అని పేర్కొన్నారు. తాము ఇష్టపడని కొందరు సీనియర్లను రాజకీయ వ్యవహారాల సంఘం (పీఎసీ)లో ఎదుర్కోవడం ఇష్టం లేకే, అటువంటి కొందరితో ఒక ‘సలహా సంఘం’ ఏర్పాటన్నది సీఎం, పీసీసీ అధినేత కలిపి పన్నిన పన్నాగమని కూడా ఎవరో ఢిల్లీ నేతల చెవిన వేసినట్టు తెలుస్తోంది. వీటన్నిటి ప్రభావమా? తమకున్న సమాచారమా? తెలియదు కానీ, మంత్రివర్గ కూర్పు. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం వంటి అంశాలతో సహా పలు విషయాల్లో ఢిల్లీ అధిష్టానం ముఖ్యమంత్రికి సంపూర్ణ స్వేచ్చ ఇస్తున్నట్టు లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ల పద్దతికే ప్రస్తుతానికి తిలోదకాలిచ్చినట్టుంది.
పార్టీ పనితీరు పైస్థాయిలో ఇలా ఉంటే క్షేత్రంలోనూ భిన్నంగా ఏమీ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమౌతున్న తరుణంలో ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ‘ట్రాకర్ పోల్ సర్వే’ గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ కాంగ్రెస్ వెనుకబడే ఉంది. సగం మంది మంత్రుల నియోజకవర్గాల్లో మెజారిటీ మండలాల్లో ప్రత్యర్థి పార్టీలదే ఆధిక్యత కనిపిస్తోంది. పైన కుదుటపడితే తప్ప కింది స్థాయిలో పార్టీ కుదురుకునే వాతావరణం లేదు.


-దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసర్చి సంస్థ.

Optimized by Optimole