12వ క్లాసు చరిత్ర పాఠంలో గోడ్సే పుణెకు చెందిన బ్రాహ్మణుడనే మాట తొలగించారు..

Nancharaiah merugumala senior journalist: 12వ క్లాసు చరిత్ర పాఠంలో గోడ్సే పుణెకు చెందిన బ్రాహ్మణుడనే మాట తొలగించారు..అనవసరంగా కులం వివరాలు చెప్పొద్దనేది బీజేపీ సర్కారు పాలసీ అట!

‘1948 జనవరి 30 సాయంత్రం తన రోజువారీ ప్రార్థనా సమావేశంలో ఉండగా గాంధీజీని ఒక యువకుడు పిస్తోలుతో కాల్చిచంపాడు. వెంటనే అక్కడ లొంగిపోయిన ఈ హంతకుడు పుణెకు చెందిన బ్రాహ్మణుడు. పేరు నాథూరాం గోడ్సే.’ అని మహాత్మా గాంధీపై రాసిన పాఠంలోని వాక్యం ఇది. ఇది 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని పాఠంలో ఉంది. అయితే, అనవసరంగా ఏ వ్యక్తి కులం వివరాలనైనా పాఠ్యపుస్తకాల్లో రాయకూడదనేది కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలోని హిందూ జాతీయవాద పార్టీ బీజేపీ సర్కారు తాజా విధానం. అందుకే ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్యపుస్తకాలను ‘హేతబద్ధంగా’ మార్చాలనే కాషాయ ప్రభుత్వం నిర్ణయం కారణంగా పైన చెప్పిన హిస్టరీ పాఠంలోని వాక్యంలో నాథూరాం గోడ్సే బ్రాహ్మణుడనే మాటను తాజాగా తొలగించారు. గోడ్సే పుణె బ్రాహ్మణుడనే వివరం 15 సంవత్సరాలపాటు 12వ తరగతి టెక్ట్స్‌ బుక్‌ లో ఉంది. దీనిపై ఇటీవల ‘ఇండియా టుడే’ టీవీ చానల్‌ లో ప్రసిద్ధ జర్నలిస్టు రాజదీప్‌ సర్దేశాయి (ఈయన భారత క్రికెట్‌ జట్టు కాప్టెన్‌ దిలీప్‌ సర్దేశాయి కొడుకు. గోమంతక్‌ బ్రాహ్మణుడు) పర్యవేక్షణలో జరిగిన చర్చలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తన తాత గాంధీ హంతకుడు గోడ్సే పుణెకు చెందిన మరాఠీ బ్రాహ్మణుడనే మాట ఉండాల్సిందేని, అలా చెప్పడం తప్పేమీ కాదని ఎంకే గాంధీ ముని మనవడు, రచయిత, చరిత్రకారుడు తుషార్‌ అరుణ్‌ గాంధీ (63 ఏళ్లు) ఈ చర్చలో పాల్గొంటూ వాదించారు. ‘‘గాంధీజీని కాల్చి చంపింది బ్రాహ్మణుడైన గోడ్సే అని పుస్తకంలో వెల్లడించడం వల్ల బ్రాహ్మలందరూ ఖూనీకోరులని ఎవరూ అనుకోరు. అయితే, గాంధీని హత్యచేసిన వ్యక్తి ఊరు, కులం, అతని మాతృభాష వంటి వివరాలు విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది,’’అని తుషార్‌ గట్టిగా వాదించారు. పన్నెండో తరగతి చదువుకుంటున్న టీనేజీ పిల్లలకు ముక్కుపచ్చలారని వయసులోనే జాతి పిత కరంచంద్‌ గాంధీజీ కులం, ఆయన హంతకుడు నాథూరాం గోడ్సే కులం తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఈ చర్చలో పలువురు విద్యావేత్తలు వాదించారు. హిందుత్వ వ్యతిరేక, ఉదారవాద భావాలున్న కాంగ్రెస్‌ హయాంనాటి జాతీయ చరిత్రకారిణి మృదులా ముఖర్జీ (ఈమె బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, కాంగ్రెస్‌ లేదా నెహ్రూ–గాంధీ కుటుంబ పాలనకు అనుకూలమైన లిబరల్‌) మాత్రం గోడ్సే కులం వివరం తొలగించడం తప్పుకాదుగాని, ముఘల్‌ వంశం రాజుల చరిత్రను తగ్గించడం లేదా తొలగించడం సబబు కాదని అన్నారు.

కుల విజ్ఞానం 20 ఏళ్లు నిండినాకే పెరగాలా?

స్నాతకోత్తర విద్యా కోర్సుల్లో చేరక ముందే యువతీయువకులు ప్రముఖుల కులాల వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదనేది మెజారిటీ భారతీయ మేధావుల అభిప్రాయం. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, సాధారణ వ్యక్తుల కులం వివరాలు తెలుసుకుని చెప్పే స్వభావం నాది. అలాంటి నాకు కూడా 20 ఏళ్లు నిండక ముందే గాంధీ కోమటనే విషయం తెలుసుగాని గోడ్సేది బ్రాహ్మణ పుటక అని ఎరగను. కులాలు, మతాలు, ప్రాంతాల వివరాలు ఎంఏలో చేరిన తర్వాతే నాకు తెలుసుకోవడం అలవాటుగా మారింది. ఇంతకీ గుజరాతీ వైశ్య కుటుంబంలో పుట్టిన  మోహన్‌ దాస్‌ కే గాంధీ అనే మహాత్ముడిని చంపిన నాథూరాం గోడ్సే అనే బ్రాహ్మణుడి కులం వివరాలు తెలియడం వల్ల భారతదేశంలో–తాము బ్రామ్మలమనే స్పృహ ఉన్న తెలుగు, తమిళ సహా అన్ని ప్రాంతాల బుద్ధిజీవులూ ఏమాత్రం నొచ్చుకోవడం లేదు. ఆ అవసరం లేదనే వివేకం వారికి ఉందంటారు మరి. విద్యార్థులకు కాలేజీలో చేరిన తర్వాత లేదా రెండు పదులు నిండినాక మాత్రమే వారు అందరి కులాల వివరాలు తెలుసుకుంటే సరిపోతుందనేది అత్యధిక ప్రజానీకం అభిప్రాయంగా కనపడుతోంది. అట్లాంటిక్‌ మహాసముద్రం దాటి భూలోక స్వర్గం అమెరికాలో చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి ఇష్టపడే అత్యధిక భారతీయులు తమతో పాటు తమ కులాన్ని, ఇతర కులాలపై ద్వేషాన్ని లేదా ప్రేమను మోసుకుపోతున్న నేపథ్యంలో– పిల్లలకు కులం వివరాలు ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిదని, కులం గురించి ఎంత ఎక్కువగా చర్చిస్తే అది అంత తొందరగా సచ్చిపోద్దని నమ్మే రాంమనోహర్‌ లోహియావాదులున్న దేశం మనది.

( గాంధీ హత్య కేసు విచారణ సందర్భంగా తీసిన ఈ ఫోటోలో మొదటి వరసలో ఎడమ వైపు కూర్చున్న వ్యక్తి నాథూరాం గోడ్సే)

Optimized by Optimole