తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారనే అంశాలపైనా శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. మద్యం ద్వారా తెలంగాణలో ఒక్కో కుటుంబం ఏటా రూ.50 వేల ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి ఇస్తే… ఆ ప్రజలకు మాత్రం ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపి గిఫ్ట్ గా ఇచ్చారని ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా దూసుకెళ్తోందని చెప్పిన బండి .. 2047 నాటికి పూర్తిస్థాయిలో ఆర్దికంగా అభివృద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’ను చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
కాగా మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా తిరిగి ఎన్నికైనందున తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు బండి. కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయ, రాజకీయ తీర్మానాలతోపాటు అనేక అంశాలపై చర్చించబోతున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంపైన, టీఆర్ఎస్ నేతల అవినీతిపై ప్రజల్లో ఎంతటి తీవ్ర వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా వెల్లడైందన్నారు. ప్రజాఆశీర్వాదం, సహకారంతో 5 విడతల పాదయాత్రను పూర్తి చేసుకున్నామని బండి పేర్కొన్నారు.