ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో ముగిసిన భారత్ కథ..!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సెమీస్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో టీం ఇండియా ఓటమిపాలైంది. దీంతో ప్రపంచకప్ గెలవాలనే మిథాలీ సేన ఆశలు గల్లంతయ్యాయి.

అంతకముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు.. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మంచి ఆరంభానిచ్చారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన షెఫాలీ, అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన యస్తికా స్వల్ప స్కోర్ కే పెవిలియన్ చేరింది. అనంతరం క్రిజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్, మరో ఓపెనర్ మందాన తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరు ఇరువురు అర్థ సెంచరీలు పూర్తి చేశాక క్యాచ్ ఔట్ గా మందాన వెనుదిరిగింది. ఆఖర్లో హర్మన్ప్రీత్ (48) మోస్తరు స్కోర్ తో ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికాకు భారీ టార్గెట్ నిర్దేశించింది.

అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరికి బంతికి విజయం సాధించింది.ఆ జట్టులో లారా వోవార్డ్‌ (80) మిగ్నాన్‌ డు ప్రీజ్‌ (52 నాటౌట్‌) అర్థ సెంచరీలతో రాణించారు. మారిజాన్నె కాప్‌ (32) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది.

భారత్ కొంపముంచిన ‘నో బాల్ ‘..
మ్యాచ్ చివరి ఓవర్. 6 బంతుల్లో 7 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుంది. ఈ స్థితిలో.. తొలి బంతికి సింగిల్‌.. రెండో బంతికి రనౌట్.. సమీకరణం నాలుగు బంతుల్లో 5 పరుగులుగా మారింది. నాలుగో బంతికి సింగిల్.. ఐదో బంతికి సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ ఔట్. భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఇంతలో ఎంపైర్ అది నోబాల్‌గా ప్రకటించింది. దీంతో స్టేడియం అంతా ఒక్కసారిగా నిశబ్దం. భారత ఆటగాళ్లు నిరాశాలో కూరుకుపోయారు. ఆ తర్వాతి రెండు బంతులకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సింగిల్స్‌ తీయడంతో భారత్‌ ఓటమిపాలైంది. చివరి మ్యాచ్ ఆడుతున్న ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ వరల్డ్ కప్ కల చెదిరిపోయింది.