అండర్-19 ప్రపంచకప్‌లో యువభారత్ జట్టు ఫైనల్ కూ దూసుకెళ్లింది. టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జోరుమీదున్న భారత్.. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరింది. దీంతో భారత జట్టు ఎనిమిదో సారి ఫైనల్ చేరినట్లయింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు.. నిర్ణీత ఓవర్లలో 290 పరుగుల చేసింది. కెప్టెన్ యష్‌ధూల్(110) సెంచరీతో రాణించగా.. వైస్‌కెప్టెన్ షేక్ రషీద్(94) హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో జాక్ నిష్బత్, విలియమ్ షల్జమన్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ జట్టు 41.5 ఓవర్లో 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు 96 పరుగులతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టులో.. లచ్లాన్ షా (51), కోరీ మిల్లర్(38) మినహా మిగితా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో విక్కీ ఓస్వాల్ మూడు, రవికుమార్, నిషాంత్ సింధు తలో రెండు వికెట్లు తీశారు.