భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజకీయ ప్రస్థానం..

భారత రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఆ పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె నిలిచారు.వివాదారహితురాలిగా పేరున్న ఆమె..తొలుత టీచర్ గా పనిచేశారు. ఆతర్వాత కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా విశేష సేవలందించారు. నాలుగేళ్ల వ్యవధిలో భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోవడం ఆమె జీవితంలో పెనువిషాదాం.

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్‌ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. తండ్రి పేరు బిరంచి నారాయణ్‌ తుడు.. తాత ఇద్దరూ గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు.

ద్రౌపదీ ముర్ము 1997లో బీజేపీ చేరారు . రాయరంగపూర్ నగర్ పంచాయితీ కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాయ్‌రంగపూర్‌ నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.

రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2000-2004 వరకు నవీన్ పట్నాయక్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

2010, 2013లో మయూర్‌భంజ్‌ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్య నిర్వాహక సభ్యురాలిగా ఉన్నారు.

2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా సేవలందించారు.

ద్రౌపదీ ముర్ము భర్త పేరు శ్యామ్‌చరణ్ ముర్ము. 2014లో ఆయన మరణించారు. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. భర్త తోపాటు.. ఇద్దరు కుమారులను నాలుగేళ్ల వ్యవధిలో కోల్పోవడం ఆమె జీవితంలో పెనువిషాదం.