Hyderabad: హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (హెచ్.ఎం.ఏ.టి) ఆధ్వర్యంలో డా.ఐ.యస్ మూర్తి స్మారక ఉపన్యాసాన్ని ఆదివారం సాయంత్రం హెచ్.ఎం.ఏ.టి. ఆవరణలోని జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డా.గోపాలకృష్ణ స్వాగతోపన్యాసం చేసి అందరినీ ఆహ్వానించగా ప్రధాన కార్యదర్శి డా.జి.దుర్గాప్రసాద్ రావు వారు నిర్వహించి ఉచిత వైద్య సేవలతోపాటు ఇతర కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డా. పెండెం భాస్కర్, ఎం. డి (హోమియో) నల్గొండ పాంక్రియాస్: నావిగేటింగ్ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ లాండ్ స్కిప్ అంశంపై సుధీర్ఘంగా ప్రసంగించారు.
అనంతరం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నుండి యస్.టి.యస్.హెచ్ ఫెలోషిప్ సాధించిన ఇరువురు డాక్టర్లు, డా. విశాల్వత్ పూజిత రాజ్ & డా. ఆముక్త వారి థీసీస్ పై ప్రసంగించారు. తదుపరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ మహిళా హోమియో వైద్యురాళ్లను సత్కరించారు.
‘ఆది ధ్వని ఫౌండేషన్’ తో అనుబంధం కలిగి ఉన్న పాలమూరు యూనివర్సిటీ ఆంగ్ల విభాగాధిపతి మాజీ ప్రొఫెసర్ డా.గూడూరు మనోజ ముఖ్య అతిథిగా విచ్చేశారు.వారు మాట్లాడుతూ ఆది ధ్వని ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతాలలో మా బృందం పర్యటించినప్పడు ఆదివాసీ ప్రజలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఇంగ్లిష్ మందులు వాడమని వారికి అందించమన్నారు.కానీ వారు ఇంగ్లిష్ మందులకు దూరంగా ఉన్నారు అని తెలిపారు . హోమియోపతి, ఆయుర్వేదంకీ దగ్గర పోలికలు కొంతమేరకు ఉంటాయి అని చెప్పారు. ఆదివాసీ ప్రజలు ఆ హోమియోపతిలో వనమూలికలు గ్రహించే అవకాశం ఉందని చెప్పారు.ఆదివాసీ ప్రాంతాలకు హోమియో బృందం విచ్చేసి గిరిజన ప్రాంత ప్రజలకు అవగాహతో హోమియో మందులతో పాటు మెరుగైన వైద్యం అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అని అన్నారు.మహిళా హోమియో వైద్యులకు జ్ఞాపికలను అందజేశారు.దాదాపు 40 మందికి పైగా మహిళలను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డా.వేణుగోపాల్ గౌరి, డా.అన్నపూర్ణ,డా.గౌతమ్ రాళ్ళబండి, డా. సాయి శృతి, డా. హర్షిత వూరే, డా. చాముండేశ్వరిలతో పాటు స్పాన్సర్ డా.ఐ.హేమప్రభ,ఇతర సీనియర్ ప్రాక్టీషనర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.