సాయి వంశీ: తెలుగులో ఆడవాళ్లు తమ బాల్య జ్ఞాపకాలు కథలుగా రాయడం అరుదు. నాకు తెలిసి సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కతలు’, పొత్తూరి విజయలక్ష్మి ‘నోస్టాల్జియా’, మన్నం సిందుమాధురి ‘ఉళైనూరు క్యాంపు కతలు’ రాశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జూపాక సుభద్ర తన బాల్య జాపకాలు రాస్తున్నారు. అలాగే కొన్ని కథల్లో ఎండపల్లి భారతక్క తన బాల్యం గురించి రాశారు. (ఇంకెవరైనా రాసి ఉంటే మెన్షన్ చేయండి).
చిత్తూరు జిల్లాలో పుట్టిన ఆచార్య మహాసముద్రం దేవకి గారు కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను ‘ఇర్లచెంగి కథలు’గా రాశారు. ఏడాది క్రితం ఈ కథలు చదివాను. అప్పటికింకా పుస్తక రూపంలోకి రాలేదు. ఎవరైనా వాటిని పుస్తకంగా తెస్తే బాగుండునని అనిపించింది. ఇంతమంచి కథలు అందరూ చదివితే మేలని ఆశ కలిగింది. సంవత్సరం తర్వాత విశాలాంధ్ర వారు పుస్తకంగా తెచ్చారు. బహుశా రాయలసీమ నుంచి తన బాల్య జ్ఞాపకాలను కథలుగా రాసిన తొలి రచయిత్రి దేవకి గారే కావొచ్చు. ‘ఇర్లచెంగి’ అనేది ఆమెకు ఇంట్లోవాళ్లు పెట్టుకున్న ముద్దు పేరు.
ఇందులో ‘ఉబ్బదేవర’ అనే కథ నాకు చాలా ఇష్టం. గ్రామాల్లోని కులవ్యవస్థను ఎత్తి చూపే కథ. రచయిత్రి ఆడుకుంటూ ఉండగా చాకలివాళ్లు దేవర చేసుకోవడం చూస్తుంది. వాళ్ల వెనుకే వెళ్తూ ఉంటే, తినడానికి రమ్మని పిలుస్తుంది చాకలి మంగ. పిలిచినప్పుడు పోకపోతే ఏమనుకుంటారో అని వెళ్తుంది రచయిత్రి. చాకలి మంగ ఆమెకు ఆకువేసి అన్నం పెట్టి చాలా మర్యాద చేస్తుంది. చేయి కడుక్కున్నాక తాంబూలం కూడా ఇస్తుంది. అవి చూపిద్దామని ఇంటికి రాగానే, విషయం తెలిసిన ఇంట్లో వాళ్లు తిడతారు. చాకళ్ల ఇంట్లో తిని వస్తావా అని అంటారు. తాను చేసిన తప్పేమిటో అర్థం కాని రచయిత్రి ఏడుస్తుంది.
‘ఎర్రజీమలు’ అనే కథను భలే గమ్మత్తుగా రాశారు. చిన్నపిల్లలకు పెద్దలు నేర్పే అలవాట్లు, మాటలు, వాటిని యథాతథంగా వాడటం వల్ల జరిగే సరదాలను ఇందులో చూడొచ్చు. రచయిత్రి ఇంట్లో బాదం చెట్టు ఉందని తెలిసి, మాస్టారు ఆమెను కొన్ని బాదం ఆకులు తెమ్మంటాడు. కానీ చెట్టు నిండా బాపనకుక్కులు. అంటే ఎర్రచీమలు. దాంతో ఎండుటాకులు తీసుకొని వెళ్లింది. పచ్చాకులు కావాలని అంటే ‘చెట్టు నిండా బాపనకుక్కులు సార్’ అని సమాధానం ఇస్తుంది రచయిత్రి. ‘అలా అనకూడదమ్మా! ఎర్రచీమలనాలి’ అని అంటారాయన. ఈ విషయం ఇంటికొచ్చి చెప్తే అమ్మ, నాన్న, అవ్వ.. అందరూ నవ్వు. ‘బాపనయివోరి దెగ్గిర బాపనకుక్కులంటే ఆయనకెట్లుంటాది?’ అని ఇంకా ఇంకా నవ్వుతారు.
‘ఏకాసొక్కపొద్దు’ అనేది మరో కథ. ఏకాదశి రోజు ఆడవాళ్లు ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి పొద్దున్న ఉపవాసం విడుస్తారు. ఇదంతా చేసి నేనూ ఉపవాసం ఉంటానంటుంది రచయిత్రి. వద్దన్నా వినదు. ఉండాల్సిందేనని పట్టుబడుతుంది. కానీ ఆకలి ఓర్చుకోలేక వడలూ, అరటిపండ్లూ తిని ఇంట్లోవాళ్లకి దొరికిపోతుంది. ఆ రాత్రి ఆటపాటలతో ఆడవాళ్లు జాగారం చేయడాన్ని అచ్చంగా ఈ కథలో చదవొచ్చు.
తెలుగు బాల్య జ్ఞాపకాల కథలకు ఈ పుస్తకం గొప్ప చేర్పు.
పుస్తకం కొనేందుకు: https://www.logili.com/short-stories/irlachengi-kathalu-prof-mahasamudram-devaki/p-7488847-53905024391-cat.html#variant_id=7488847-53905024391