LawrenceBishnoi: బిష్ణోయీ..దావూద్‌ సహా పాత గ్యాంగ్‌స్టర్లంతా చదువులేనోళ్లు.!

Nancharaiah merugumala senior journalist:

బాగా తెల్లగా, ఎర్రగాబుర్రగా ఉన్నాడని బిష్ణోయీ కుర్రాడికి బ్రిటిష్‌ ఉన్నతాధికారి హెన్రీ లారెన్స్‌ పేరు!

బాలీవుడ్‌ ‘కండలవీరుడు’, ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన అత్యంత లౌకిక పౌరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరినీ ‘టైగర్‌ జిందా హై’ హీరో తన నివాసంలోకి అనుమతించడం లేదు. ఇవి ఇప్పుడు ఇంగ్లిష్‌ న్యూజ్‌ చానల్స్‌లో పదే పదే విసుగుపుట్టేలా చూపించే వార్తలు. ప్రస్తుతం గుజరాత్‌ పూర్వ రాజధాని అహ్మదాబాద్‌ సబర్మతీ ప్రాంతంలోని సెంట్రల్‌ జైల్లో నిర్బంధంలో ఉన్న అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయీ త్వరలోనే సల్మాన్‌ను చంపుతానని బెదిరించాడనే వార్తలు ఒక వైపు, మరో వైపు కెనడా–ఇండియా దౌత్య సంక్షోభంలో బిష్ణోయీ గ్యాంగ్‌ ప్రస్తావన రావడంతో ఈ 31 ఏళ్ల బాగా చదువుకున్న లారెన్స్‌కు ఎనలేని ప్రచారం లభిస్తోంది. లారెన్స్‌ బిష్ణోయీ కుటుంబానికి పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లా అబొహర్‌ తాలూకా దుతారావాలీ గ్రామంలో 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే, రాజస్తాన్‌ ఎడారి ప్రాంతాన్ని ఆనుకుని, హరియాణాకు, పాకిస్తాన్‌ సరిహద్దుకు సమీపాన ఉండడమే దుతారావాలీ జనానికి బలం అని చెబుతారు. లారెన్స్ ఫ్యామిలీకి వందెకరాల సాగు భూమి ఉండడమే కాదు, అతని తల్లి సునీత కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చదువు పూర్తిచేసింది. దుతారావాలీలో, తాలూకా కేంద్రం అబొహర్‌లో హైస్కూలు చదువు (పన్నెండో తరగతి) పూర్తయ్యాక బిష్ణోయీ పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో ప్రసిద్ధ డీఏవీ కాలేజీలో డిగ్రీ, పంజాబ్‌ యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదువుకున్నాడు. స్టూడెంట్స్‌ యూనియన్‌ రాజకీయాల వల్ల లారెన్స్‌ నేరాలు చేయడం, జైళ్లలో ఉండగా నేరస్తులతో సావాసం వల్ల గ్యాంగ్‌స్టర్‌ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. పంజాబ్‌ పట్టణాలు, నగరాల్లో గ్యాగ్‌స్టర్లుగా ఎక్కువ మారేది గతంలో వ్యవసాయాదాయం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న గ్రామాల బడా బడా రైతుల కొడుకులేనని పంజాబీ రాప్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్యపై పుస్తకం రాసిన జర్నలిస్టు కూడా అయిన రచయిత వెల్లడించారు. 2022 మే 29న లారెన్స్‌ బిష్ణోయీ ముఠా సభ్యులు పంజాబ్‌లో మూసేవాలాను కాల్చిచంపిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఇంజనీరింగ్‌ చదవి కెనడాలో కూడా ఉన్నత విద్య అభ్యసించిన మూసేవాలా (అసలు పేరు శుభ్‌దీప్‌సింగ్‌ సిధూ) అక్కడే రాప్‌ సంగీతంలో పేరు సంపాదించారు. ఇలా కెనడాతో, అక్కడి పంజాబీ గ్యాంగ్‌స్టర్లతో బంధం సిద్దూమూసేవాలాకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూసేవాలా హత్యపై పంజాబ్, హరియాణా, దిల్లీలో ప్రాచుర్యం ఉన్న ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక ‘ద ట్రిబ్యూన్‌’ డెప్యూటీ ఎడిటర్‌ జుపీందర్‌జీత్‌ సింగ్‌ ‘‘హూ కిల్డ్‌ మూసేవాలా’’ అనే పుస్తకం రాశారు. గత పది సంవత్సరాల్లో ఉత్తరాది నేర ప్రపంచంలో గ్యాగ్‌స్టర్ల తీరుతెన్నులను ఇందులో చక్కగా వివరించారు. ఈ పుస్తకం రాయడానికి అవసరమైన పరిశోధనలో భాగంగా దుతారావాలా గ్రామానికి వెళ్లి లారెన్స్‌ తల్లి సునీతతో మాట్లాడారు జుపీందర్‌జీత్‌ సింగ్‌.

లేత గులామీ రంగులో ఉన్నాడని ‘లారెన్స్‌’ పేరు..

‘‘లారెన్స్‌ చాలా బాగా తెల్లగా ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే లేత గులాబీ రంగులో ఐరోపా దేశానికి చెందిన బాలుడిలా కనిపించేవాడు. ఇండియన్‌ కాదేమో అనే రీతిలో మెరిసిపోయేవాడు,’’ అని పైన ప్రస్తావించిన పట్టభద్రురాలైన గృహిణి సునీత కిందటేడాది తనను కలిసిన జర్నలిస్టు జుపీందర్‌జీత్‌సింగ్‌కు తన కొడుకు గురించి చెప్పింది. ఉత్తరాదిన నివసించే ఓబీసీ హిందువులైన బిష్ణోయీలు ఎవరూ తమ కొడుకులకు లారెన్స్‌ అనే పేరు పెట్టరు. అదీగాక అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన బిష్ణోయి కుటుంబం క్రైస్తవం తీసుకోలేదు. పూర్తిగా సాంప్రదాయ హిందువులు. కేవలం చిన్నప్పుడు తెల్లగా, యూరోపియన్‌ పిల్లాడిలా ఉన్నందు వల్లే అతనికి లారెన్స్‌ అనే పేరు పెట్టామని తల్లి సునీత వెల్లడించింది. పంజాబ్‌ ప్రాంతంలో హెన్రీ మాంట్‌గోమరీ లారెన్స్‌ (1806 జూన్‌ 28–1857 జులై 4) అనే బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ఉన్నత సైనికాధికారి, పేరున్న సర్వేయర్, ఉన్నత పాలనాధికారి పేరు గత 200 ఏళ్లుగా పూర్వపు ఉమ్మడి పంజాబ్‌ (పాకిస్తాన్‌లోకి పోయిన పెద్ద పంజాబ్‌తో కలిపి) అందరికీ తెలుసు. పంజాబ్‌ పాలకుడు మహారాజా రంజీత్‌సింగ్‌ కాలం నుంచి పంజాబ్‌లో సైనికాధికారిగానేగాక, ల్యాండ్‌ సర్వేయర్‌గా ఎనలేని సేవలందించిన ఈ హెన్రీ లారెన్స్‌ పేరు పంజాబ్ లో… కోస్తాంధ్ర జిల్లాల్లో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ కంటే ఎక్కువ పాప్యులర్‌. భూమి సర్వేచేయడం అనేది రెండొందలేళ్ల క్రితం ఉమ్మడి పంజాబ్‌లో చాలా గొప్ప కార్యం, అందుకే కోస్తాంధ్ర జిల్లాల జనం ‘కాటన్‌ దొర’ పేరు తలచినట్టే ఇప్పటికీ హెన్రీ లారెన్స్‌ సేవలను పంజాబీలు పదే పదే గుర్తుచేసుకుంటారు. అంతటి గొప్ప బ్రిటిష్‌ పాలనాధికారి పేరును కేవలం శరీర ఛాయ కారణంగా లారెన్స్‌ బిష్ణోయీకి పెట్టడం అతని తల్లిదండ్రుల ‘ఉన్నత స్థాయి’ని చెబుతోంది. పంజాబ్‌ ఫాజిల్కా–అబొహర్‌ ప్రాంతంలోని భూములు ఎక్కువ ఆదాయం ఇచ్చేవి కాకపోవడంతో నూరు ఎకరాలున్నాగాని లారెన్స్‌ తండ్రి పంజాబ్‌ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరాడు. కొన్నేళ్లు పనిచేసి మానివేశాక వ్యావసాయంలో స్థిరపడ్డాడు. పంజాబ్‌ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ధనిక రైతుల కొడుకులు నగరాల్లోని కాలేజీల్లో చేరిన తర్వాత తమ గ్రామీణ నేపథ్యం కారణంగా ఏదో ఒక సంచలనం సృష్టించి తమ ప్రత్యేకత నిరూపించుకునే క్రమంలో నేర ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారని కూడా జర్నలిస్టు జుపీందర్‌జీత్‌సింగ్‌ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మరి ఈ క్రమంలోనే పంజాబ్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ కూడా చదివిన గ్రామీణ విద్యార్థి లారెన్స్‌ నేరప్రపంచంలోకి ప్రవేశించి గాంగ్‌స్టర్‌గా మారాడని భావించాల్సి ఉంటుంది.‘‘ పంజాబ్‌ ఊళ్ల నుంచి నగరాల్లోని కళాశాలల్లో చేరే విద్యార్ధులందరూ ‘బాగా కలిగిన, మంచి కుటుంబాల’ నుంచి వచ్చినవారే. సాంస్కృతికంగా, మేధోపరంగా ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్న నగర విద్యార్ధుల మధ్య వారు ఇబ్బంది పడతారు. తాము ‘భూస్వాముల వారసులం’ ఇంకే మాత్రం కాదనే స్పృహ వారికి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో కలుగుతుంది. ఈ గ్రామీణ యువకులు తమ ‘విశిష్ఠత’ చూపించే క్రమంలో తప్పుదారిపడుతున్నారు,’’ ఆయన విశ్లేషించారు.

విలువలు పాటించే యువకుడు లారెన్స్‌’

బిష్ణోయీలు రాజస్థాన్‌ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువ. భౌగోళికంగా రాజస్తాన్, హరియాణా, పంజాబ్‌ పశ్చిమ ప్రాంతాలు ఆనుకుని ఉండడంతో ఈ మూడు చోట్లా చెప్పుకోదగ్గ సంఖ్యలో బిష్ణోయీలేగాక ఈ కులస్తులు తమ పూజ్య గురువు జంబేశ్వర్‌ అవతారంగా నమ్మే కృష్ణజింకలు, వారు బాగా ఇష్టపడే వన్య జంతువులైన చింకారాలు కూడా ఉంటాయి. వాటి కోసం అభయారణ్యాలు రాజస్తాన్‌తోపాటు ఫాజిల్కా–అబొహర్‌లో కూడా ఏర్పాటు చేశారు. సామాజిక నేపథ్యం కారణంగా లారెన్స్‌ తన ముఠా సభ్యులుగా రాజస్తాన్‌లోని సమీప ప్రాంతాల బిష్ణోయీ యువకులను రిక్రూట్‌ చేయడం బహిరంగ రహస్యమే. మరి తమ గురువు జంబేశ్వర్‌ అవతారంగా భావించే కృష్ణ జింకలను వేటాడి చంపాడనే అభియోగం ఎదుర్కొంటూ ఇంకా పై కోర్టు విచారణలో ఉన్న సల్మాన్‌ ఖాన్‌ తన ప్రాణరక్షణ కోసమైనా తన నేరం ఒప్పుకుంటే మంచిదనే అభిప్రాయం ఉత్తరాదిన బలపడుతోంది. 1998లో జరిగిన నేరానికి ప్రధాన నిందితుడైన సల్మాన్‌కు శిక్ష పడకపోవడం ‘నిష్ఠగా బ్రహ్మచర్యం పాటించే’ లారెన్స్‌ బిష్ణోయీకేగాక కృష్ణజింకను దైవంగా భావించే సాధారణ బిష్ణోయీలందరికీ ఎనలేని మానసిక క్షోభ పెంచే విషయం. తనను కలిసిన వారితో సంభాషణ ముగిస్తూ తరచు ‘జైశ్రీరామ్‌’ అనే మాటలు బిగ్గరగా పలికే లారెన్స్‌ ఇప్పుడు బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ప్రముఖుడు హెన్రీ మాంట్‌గోమరీ లారెన్స్‌ను మించిన పేరు ప్రఖ్యాతులు సంపాదించే దశకు చేరుకుంటున్నాడు. 2014 నుంచి ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల జైళ్ల నుంచి తరచు బదిలీ అవుతూ పదేళ్లుగా నిర్బంధంలో ఉన్న బిష్ణోయీకి రాజస్తాన్, హరియాణా, పంజాబ్‌తోపాటు న్యూఢిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌లో కూడా అనుచరులు ఉన్నారు. అతని నెట్‌వర్క్‌ కెనడా, అమెరికా వరకూ విస్తరించి ఉందంటే..ప్రసిద్ధ ఇంగ్లిస్‌ జర్నలిస్టు వీర్‌ సంఘ్వీ చెప్పినట్టు ప్రస్తుతం పాకిస్తాన్‌ మహానగరం కరాచీలోని క్లిఫ్టన్‌ ప్రాంతంలో రహస్య జీవితం గడుపుతున్న దావూద్‌ ఇబ్రాహీం కస్కర్‌ కన్నా లారెన్స్‌ చాలా వేగంగా చిన్న వయసులో (30 ఏళ్ల లోపే) ఎదిగిపోయాడనుకోవాల్సిందే.

దావూద్‌ సహా పాత గ్యాంగ్‌స్టర్లంతా చదువులు లేనోళ్లు..

‘డీ కంపెనీ’ అధిపతిగా పేర్కొనే ఇబ్రాహీం మామూలు కానిస్టేబుల్‌ కొడుకు. కాలేజీ మెట్లు ఎక్కలేదు. అతనే కాదు, అతని ముందు ముంబాయి అండర్‌వరల్డ్‌ బాసులుగా రాజ్యమేలిన తమిళ హజీ మస్తాన్, వరదరాజన్‌ ముదలియార్‌ కూడా కాలేజీ చదువులున్నవారు కాదు. సాధారణంగా పాత బొంబాయి. మద్రాసు, కలకత్తా, హైదరాబాద్, బెజవాడలోని పాత తరం గూండాలు, నేర ముఠాల లీడర్లు చదువుకున్నోళ్లు కాదు. హైదరాబాద్‌లో యూసుఫ్‌గూడ, జూబిలీ, బంజారాహిల్స్‌ ప్రాంతంలో పాతికేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన వి.చిన్న శ్రీశైలం యాదవ్, అతని సమకాలికుడు అంబర్‌పేట శంకర్ ముదిరాజ్, 1980ల్లో హైదరాబాద్‌ మలక్‌పేట్‌ నుంచి కోఠీ–అబీడ్స్‌ వరకూ వ్యాపారులను బెదిరిస్తూ బతికిన కొత్త దాస్‌ గౌడ్‌ తదితర పాత తరం నేరగాళ్లు లేదా ‘సంఘటిత’ నేర ముఠాల నేతలు కూడా కాలేజీల్లో విద్య అభ్యసించలేదు. డబ్బున్న కుటుంబాల్లో పుట్టినోళ్లూ కాదు. అలాగే, విజయవాడలోని పాత తరం రౌడీల స్థాయి నుంచి చట్టసభల సభ్యులుగా ఎదిగిన వంగవీటి మోహనరంగా, దేవినేని రాజశేఖర్‌ ‘నెహ్రూ’ కుటుంబాలు మొదట చిన్నాచితకా వ్యాపారం చేసుకుని బతికినవే. 1960లు, 70ల్లో వంగవీటి కుటుంబం బెజవాడ పడమటలో సైకిల్‌ షాపు పెట్టుకుని జీవిస్తే, దేవినేని కుటుంబం అదే ఊరు గుణదలలో మొదట ఇంట్లో సోడాలు పట్టి కిళ్లీషాపులకు వేయడం నుంచి కూల్‌డ్రింక్‌ షాపు నడపడంతో బతికేసింది. మరి ఇలాంటి తెలుగు నాటు గ్యాంగ్‌స్టర్లతో పోల్చితే లారెన్స్‌ బిష్ణోయీ ఏ స్థాయిలో ఉన్నాడో ఇప్పుడు అంచనా వేయవచ్చు. ‘‘లారెన్స్‌ బిష్ణోయీ అంతటి అందగాడు తెలుగు సినీ ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు. బాబా సిద్దిఖీని చంపడానికి ఫేస్‌బుక్‌ ద్వారా కుర్రాళ్లను లారెన్స్‌ రిక్రూట్‌ చేశాడంటే అతనిపై తప్పక నేను సినిమా తీయాల్సిందే,’’ అని బాగా హిట్టయిన గ్యాంగ్‌స్టర్‌ సినిమాల దర్శకుడు పెన్మెత్స రామ్‌గోపాల్‌ వర్మ ‘ఎక్స్‌’లో మహారాష్ట్ర మాజీ మంత్రి, సల్మాన్‌ ఆత్మబంధువు బాబా సిద్దిఖీ హత్యపై మొన్న వ్యాఖ్యానించారు. లారెన్స్‌ గ్యాంగ్‌ బెదిరింపులకు, ఆరోపణలకు సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు జవాబు చెప్పక తప్పదని రామూ వర్మ తాజాగా చెప్పిన మాటలు నిజంగా ఆలోచించదగ్గవే.