బూర కారు దిగడానికి మంత్రి జగదీశ్ వైఖరే కారణమా..ఇందులో నిజమెంత?

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఉప ఎన్నికలో సీటు ఆశించి భంగపడ్డ బూర.. కొద్ది రోజుల క్రితం బాహటంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై విమర్శలు చేశారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరాఖరికి సీఎం కేసిఆర్ బుజ్జగింపు ప్రయత్నాలు చేసిన తీవ్ర అసహనంతో ఉన్న బూర పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

బూర పార్టీ మార్పుకు మంత్రి జగదీష్ వైఖరే కారణమా..?

మునుగోడు నియోజకవర్గంలో బూర నర్సయ్యకు అందరివాడిగా పేరుంది.పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానించేవారున్నారు. దీనికి తోడు ఆయన చేపట్టినటువంటి సేవ కార్యక్రమాలు ఆయన ఇమేజ్ కి మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల్లో మాత్రం ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. అయితే మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా ఆయన సీటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. నియోజక వర్గంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉండటం.. కూసుకుంట్లకు సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉండటంతో సీటు తమ నేతకే వస్తుందని ఆయన అనుచరులు ధీమాతో ఉన్నారు. అయితే మంత్రి జగదీష్ రెడ్డి..కూసుకుంట్లకు మద్దతుగా నిలవడం.. పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం వంటి విషయాలు.. బూర ,అతని  అనుచరులకు రుచించలేదు.దీంతో  బూర మంత్రి టార్గెట్ గ బాహాటంగానే  విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ నేతలమని పదవులు చూసి విర్రవీగే వాళ్ళ పరిస్థితి ఏంటో మన్నన చేసుకోవాలి అంటూ  చురకలంటించారు. తనకు కేసిఆర్ మాత్రమే నాయకుడు అంటూ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసిఆర్.. అతన్ని స్వయంగా పిలిచి బుజ్జ గించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ మంత్రి వైఖరిలో మార్పు కనిపించక పోవడంతో పార్టీ వీడెందుకు సిద్ధమయ్యారు.

ఇక బూర పార్టీ మార్పుకు వినిపిస్తున్న మరో బలమైన కారణం.. ఉప ఎన్నిక నామినేషన్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామని నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఈ కార్యక్రమంలో బూర కనిపించినప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అతనికి సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదన్నది అతని వర్గీయుల మాటగా వినిపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక బూర బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరే అవకాశం..?

మాజీ ఎంపి బూర నర్సయ్య ఆయన అనుచరులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన ఆయన.. ఇప్పటికే బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఉప ఎన్నిక వెళ బూర చేరిక బీజేపీ కి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు. నియోజకవర్గంలో బీసీ ఓట్లన్నీ గంపగుత్త గా పడటం ఖాయమన్న ప్రచారం  ఇప్పటికే ఊపందుకున్న నేపథ్యంలో కాషాయం నేతలు క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

మొత్తంమీద బూర ఎంట్రీతో ఇటు టీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలవగా..అటు బీజేపీ నేతల్లో  జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఉప ఎన్నికలో విజయం సాధించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలం నేతలు ఉవ్విళ్లరుతున్నారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole