ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా?

Nancharaiah merugumala (senior journalist)

వాజపేయి వంటి బ్రాహ్మణ ప్రధాని పాలనలో ఇలా జరిగేది కాదు!

ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా?

గుజరాతీ మోధ్ ఘాంచీ (తేలీ) కుటుంబంలో పుట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన ఇంటిపేరుతో కించపరిచారనే కారణంతో ఫస్ట్‌ ఫ్యామిలీ (నెహ్రూ–గాంధీ) రాజకీయ వారసుడు రాహుల్‌ గాంధీకి సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్ముఖ్‌ వర్మ గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ప్రకటించిన 24 గంటల్లోపే తొలి ప్రధాని, కశ్మీరీ పండితోత్తముడు జవాహర్‌ లాల్‌ నెహ్రూ మునిమనవడైన రాహుల్‌ గాంధీని లోక్‌ సభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ‘ఎంతటి బలమైనదో’ చెబుతోంది. బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా మోదీ వంటి ఓ ఓబీసీ నేత ప్రధానిగా ఉంటే ఎలాంటి పరిణామాలు పార్లమెంటు ఎన్నికలకు ఏడాది ముందు సంభవిస్తాయో నేటి పరిణామం సూచిస్తోంది. ఏదేమైనా అటల్‌ బిహారీ వాజపేయి వంటి సౌమ్యుడైన బీజేపీ బ్రాహ్మణ ప్రధాని ఇప్పుడు అధికారంలో ఉండి ఉంటే కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబ వారసుడు రాహుల్‌ గాంధీకి ఇంతటి కష్టం వచ్చేది కాదని కొందరు ప్రజాస్వామికవాదులు బాధపడుతున్నారు. బాబాసాహబ్‌ భీంరావ్‌ అంబేడ్కర్‌ చెప్పినట్టు పవిత్రభారతంలో కులం, కులాధారిత ఇంటిపేర్లు ప్రాతినిధ్య ప్రజాస్వామాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

You May Have Missed

Optimized by Optimole