రామాయణంలో శంబూకుని వధ ప్రక్షిప్తమా?

రామాయణంలో శూద్రుడైన శంభూకుడు తపస్సు చేయుచున్నందున ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడని కొందరు ఆరోపించారు. వారి ఆరోపణలు విశ్వసించి శ్రీరాముడు శంబూకుణ్ణి వధించినట్లు ఒక కథ ఉంది. ఇది మూల వాల్మీకి రామాయణంలో ఉన్నదా? లేదా తరువాత ప్రక్షిప్తం చేయబడిందా? అనే విషయాన్ని పరిశీలిద్దాం.

శ్రీరాముని యొక్క గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఊర్వశి కొడుకు. ఊర్వశి ఇంద్రలోకంలో నర్తకి. వశిష్ఠుని భార్య అరుంధతి. అరుంధతి మాల. విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆ రోజుల్లో విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారి కులాలతో నిమిత్తం లేకుండా తపస్సు చేసినట్లు మనకు తెలియు చున్నది. కాబట్టి తపస్సు చేయడానికి భగవంతుని ధ్యానించడానికి జ్ఞాన సమూపార్జనకు కులాలు అడ్డు రాలేదని తెలియచున్నది. ఇలాంటి చరిత్ర కలిగిన వశిష్ఠుడు శూద్రులు విద్యకు తపస్సుకు అర్హులు కారని శ్రీరామునికి చెప్పి ఉండడు.

ఇక వశిష్ఠుడు బోధించిన యోగవాశిష్టం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయుచున్నది. యోగవాసిస్టంలోని ముముక్షు వ్యవహార ప్రకరణము లోని సర్గ 4 లోని 9 నుంచి 19 వరకు ఉన్న శ్లోకాలలో” ఏ మానవునికైనా పురుష ప్రయత్నం వలన జ్ఞానము లభించును.అని “పంచమసర్గాలో ని మూడవ పదమూడవ శ్లోకములు ఈ విషయాన్ని తెలుపుచున్నాయి. ఇక రెండో విషయాని కొస్తే రామాయణం రచించింది వాల్మీకి. వాల్మీకి ఒక బోయ కులానికి చెందిన వారని అందరికీ తెలిసిన విషయమే. ఆయన తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించుకొని రామాయణాన్ని రచించాడు. అంటే వాల్మీకి కథ కూడా ఏ కులం వాడైనా ఏ జాతివాడైనా జ్ఞానాన్ని సంపాదించవచ్చని తపస్సు చేయవచ్చని తెలుపుచున్నది.

అటువంటి వాల్మీకి శంభూకుని కథ వ్రాసి ఉండకపోవచ్చు.అలాంటి ఆస్కారం లేదు. రామాయణ కథను బట్టి రాముడు విశ్వామిత్రుడు యాగాన్ని సంరక్షించి మిథిలా నగరానికి వెళుతున్నప్పుడు శబరి అతనికి ఆతిథ్యమిస్తుంది. శబరి మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేది. మాతంగ మహర్షి తల్లి మాదిగ. అటువంటి మాతంగ మహర్షి ఆశ్రమానికి రాముడు వెళ్లి శబరి ఆతిథ్యం స్వీకరిస్తాడు. శబరి కులం ఏమిటి? మాతంగ మార్చి కులమేమిటి? రాముడు చూడలేదు. మాతంగ మహార్షి కూడా తపస్సు చేసి మహర్షి అయ్యాడు. వశిష్టుని కథ విశ్వామిత్రుని కథ మాతంగ మహర్షి కథ ఎవరైనా యజ్ఞాలు యాగాలు చేయవచ్చని తపస్సు చేయవచ్చని తెలుపుతున్నాయి.

రాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు బెస్తవాడైన గుహుడు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరిస్తాడు. గహుడు ఏ కులం వాడని రాముడు ఆలోచించలేదు. తరువాత రామాయణ కథను బట్టి రాముడు ఆంజనేయుని సుగ్రీవుని మొదలైన వానరుల సాహాయం తీసుకున్నాడు. అటువంటి సందర్భంలో వారి జాతి ఏమిటి అని శ్రీరాముడు ఆలోచించలేదు. ఆంజనేయుడు సకల వేద వేదంగ పండితుడని రామాయణం చెబుతున్నది. అంటే వానరులు కూడా జ్ఞానానికి అర్హులే అని రామాయణం చెప్తున్నది. అంటే రామాయణ కాలంలో ఏ కులం వారైన తపస్సు చేయవచ్చని వేద విజ్ఞానాన్ని పొందవచ్చని జ్ఞానానికి భక్తికి ప్రేమకు కులం అడ్డు కాలేదని తెలుస్తుంది.

అటువంటి రాముడు శూద్రుడు తపస్సు చేయడం వల్ల ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోయాడని చెపితే నమ్ముతాడా? ఆ మాటలు నమ్మి శంబూకుణ్ణి చంపుతాడ ?ఇది కచ్చితంగా ప్రక్షిప్తమని నా అభిప్రాయం. వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తం జరిగినదనడానికి మరొక ఉదాహరణ రాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత రాముని తిరిగి అయోధ్యకు తీసుకొని రావడానికి భరతుడు, కౌసల్య, కైకేయి వశిష్ఠుడు మొదలైన అనేకమంది ఋషులు వెళతారు. అందులో చార్వాకుడు కూడా ఉన్నాడని కథ .అంటే దేవుని విశ్వసించని వారు దేవుని ఉనికిని ప్రశ్నించేవారు ఆ కాలంలో ఉండే వారిని వారిని కూడా గౌరవించేవారని తెలుస్తున్నది. శ్రీరాముని అయోధ్యకు రావాలని చార్వాకుడు కూడా కోరుతాడు. చార్వాకుడు పరలోకం లాంటిది ఏమీ లేదని వాదించాడని దానికి జవాబుగా శ్రీరాముడు “నీవు బుద్ధుని భోధనలు చెబుతున్నావు. బుద్ధుడు ఒక దొంగ అన్నట్లు కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తం చేశారు. మహాకవి వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం అయోధ్యకాండములోని సర్గా 109 లోని 33వ శ్లోకం ఇలా ఉంది. యధాహి చోర సతథాహి బుద్ధ తథాగతం నాస్తిక మత్ర విద్ది”

ఈ విషయాన్ని గురించి మేధావులు ఆలోచించాలి. బుద్ధుడు క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల కిందటివాడు. రామాయణం క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి 7000 సంవత్సరాల మధ్యలో జరిగినట్లు శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఢిల్లీ చాప్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ యొక్క డైరెక్టర్ సరోజ్ బాల ఇలా తెలియ జేశాడు. రామాయణం భారతం జరిగిన దనడానికి సాక్షాధారాలు ఉన్నాయి. రామాయణ కాలం క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల లోపు జరిగిందని అంచన.” దశావతారాల్లో కూడా రామావతారం కృష్ణావతారం తర్వాతనే బుద్ధా వతారం చూపారు. అంటే రాముని కాలంలో బుద్ధుని బోధనల గురించి బుద్ధుని గురించి చర్చించే అవకాశం లేదు. ఇలా రామాయణంలో బుద్ధుని విమర్శిస్తూ చెప్పబడిన శ్లోకాలు ప్రక్షిప్తమని స్పష్టంగా తెలుస్తుంది. మేధావులు రచయితలు విజ్ఞులు మరింత పరిశోధన చేసి ఈ విషయంలో స్పష్టత కలిగించాలి.

===================
జస్టిస్ చంద్రకుమార్
8978385151

Optimized by Optimole