జమ్ముకశ్మీర్‌లో విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా.. ఏడు ప్రధాన పార్టీలతో ఏర్పడిన పీపుల్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీజీడీఏ) నేతలతో కేంద్రం సంప్రదింపులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు భాజపా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయకారణాల వల్ల 2018లో కూటమి నుంచి భాజపా వైదొలగింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. ఆ తర్వాత 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేపట్టింది.
జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్.. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం అం విభజించింది. ఈ క్రమంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి రావడంతో పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ఎన్నికలు నిర్వహించడం ద్వారా కశ్మీర్‌లోయలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.
మరోవైపు కేంద్రంతో చర్చలకు తాము సిద్ధంగా ఉంటున్నట్లు గుప్కార్ అలయన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. కశ్మీర్లో పూర్వ పరిస్థితులు తీసుకురావడమే లక్ష్యంగా పీజీడీఏ ఏర్పాటైందని ఆయన వెల్లడించారు. ఈ విషయమై గతవారం పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీతో ఆమె నివాసంలో భేటీ అయినట్లు అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతోపాటు, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ అప్నీ తదితర ఏడు పార్టీలు పీజీడీఏలో భాగస్వాములుగా ఉన్నాయి.