వైసీపీ నేతలకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేకుండా పోయిందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.ఓ పక్క ప్రజలు మాండేస్ తుపాన్ తో ఇబ్బందులు పడుతుంటే..కనీస చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం..దాన్ని వదిలేసి జనసేన పార్టీ వాహనం వారాహి రంగుల మీద మాట్లాడడం అత్యంత శోచనీయమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఉదయం లేస్తే ఎదుటి వారిని తిట్టుకోవడం.. కాలాన్ని వృథా చేయడం తప్ప ప్రజా సమస్యల మీద వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధిలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని జగన్ ప్రభుత్వం యువతకు ఇవ్వాల్సిన జాబ్ కార్డులను ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేయడం చేతగానితనమని దుయ్యబట్టారు. యువతకు ఎల్లవేళలా జనసేన అండగా నిలుస్తుందని మనోహర్ భరోసా ఇచ్చారు.
వారాహి ప్రకటనతో వైసీపీకి భయం పట్టుకుంది…
కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని చెప్పగానే వైసీపీ పాలకులకు భయం పట్టుకుందన్నారు మనోహర్. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వ పాలన మీద చాలా కోపంతో ఉన్నారన్నారు. మత్స్యకారుల సమస్యలను, మత్స్యకారుల అభ్యున్నతిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. వేటకు వెళ్లని సమయంలో ప్రభుత్వం ఇచ్చే కనీస సహాయం కూడా ఈ ప్రభుత్వం అందించడంలేదని ఫైర్ అయ్యారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసేలా తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 మీద జనసేన పోరాడిందని గుర్తుచేశారు. మత్స్యకార భరోసా యాత్ర ద్వారా మత్స్యకారుల సమస్యలను స్వయంగా తాను తెలుసుకున్నట్లు.. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని మనోహర్ పేర్కొన్నారు.
అసాంఘిక శక్తుల పెంచి పోషిస్తున్నారు..
గతంలో వంద రూపాయలు ఉండే క్వార్టర్ మద్యం బాటిల్ ఇప్పుడు రూ.200 దాటిందన్నారు మనోహర్. గంజాయి అమ్మకం ప్రతి వీధిలోను జరుగుతోందని. గంజాయి అమ్మకాలను బహిరంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులను, అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించడంలో వైసీపీ ప్రభుత్వం ముందుందన్నారు. తమ వారి జేబులు నింపడానికి ఈ ప్రభుత్వం రకరకాల అడ్డదారులు తొక్కుతోందని మనోహర్ నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉంటే..ఇటీవల రెండు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కులను మనోహర్ అందజేశారు. తుని నియోజకవర్గం బొద్దవరం గ్రామానికి చెందిన వేగి హేమ కిషోర్ వ్యవసాయ పొలంలో విద్యుత్ షాక్ తగిలి ప్రమాదవశాత్తు మృతి చెందారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన హేమ కిషోర్ మృతికి సంతాపం తెలుపుతూ పార్టీ తరఫున ఐదు లక్షల చెక్కును అతని భార్య లక్ష్మికీ అందజేశారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి గ్రామానికి చెందిన మర్రి రమణ ఇటీవల ప్రమాదంలో మృతి చెందగా ఆయన భార్య దేవికి 5 లక్షల చెక్ అందజేశారు. పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది అని మనోహర్ వారికి భరోసా ఇచ్చారు.