Janasena: మత్సకార భరోసా పథకం అమల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో మత్స్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ కి వినతిపత్రం సమర్పించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్న తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరుల్లో ఆందోళన, అలజడి ఉన్నాయన్నారు. గత ఏడాది జాబితాలో ఉన్న పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా జనాభా పెరుగుతుంటే ప్రభుత్వం వద్ద ఉన్న లబ్దిదారుల జాబితాలో సంఖ్య మాత్రం తగ్గుతుందన్నారు. గురువారం సాయంత్రం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని యర్రంశెట్టి వారి పాలెంకి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. శ్రీ నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున రూ. 5 లక్షల బీమా చెక్కును అతని భార్య రత్నకుమారికి అందచేశారు.
అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే మత్స్యకార భరోసా కార్యక్రమం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్ల సాయంతో భరోసా అందుకునే వారు వైసీపీకి చెందిన వాళ్ళా కాదా అని జల్లెడ పట్టి మరీ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రత్యేక లిస్టులు తయారు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన కొత్త జాబితా ప్రచురించబోతున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం కాకినాడ పట్టణంలోని ఫిషరీస్ అధికారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం.
పొత్తుల గురించి గత ఏడాదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటన చేశారని మనోహర్ గుర్తు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందర్నీ కలుపుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టు పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో చోటు చేసుకునే పరిణామాలు అంతా గుర్తిస్తార”ని అన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్, తుమ్మల రామస్వామి, డి.ఎం.ఆర్.శేఖర్, శిరిగినీడి వెంకటేశ్వరరావు, బంధనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.