ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రజల దగ్గరకు ప్రతిపక్షాలు వెళ్తే నష్టం వస్తుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం.. జీవో 1 పేరుతో ఆంక్షలకు పూనుకుందని మండిపడ్డారు. నిరంకుశ జీవోలు తీసుకొచ్చినంత మాత్రాన ప్రజల మనసులను మార్చలేరని స్పష్టం చేశారు.175కి 175 స్థానాలు గెలుస్తామన్న సీఎం జగన్ రెడ్డికి.. అభద్రతా భావం? ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో పెన్షన్ తొలగించారని.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఆందోళనకి గురి చేస్తున్నారని.. ఎక్కడ చూసినా ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి దిగజారిందని… వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చీకటి జీఓ తీసుకొచ్చారని మనోహర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కాగా అధికార వైసీపీ, ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకత తట్టుకోలేక.. ప్రతిపక్ష పార్టీల ప్రస్థానాన్ని ఆపేందుకు చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామన్నారు మనోహర్. ముఖ్యమంత్రి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తే అయితే ఎందుకు ప్రజల వద్దకు రాడని ప్రశ్నించారు. వేల మంది పోలీసుల్ని వెంట పెట్టుకుని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ప్రజా సమస్యలపై గళం విప్పే బాధ్యత తమకుందని.. ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఎన్ని ఒత్తిడులు తీసుకువచ్చినా.. చట్టాలను గౌరవిస్తామని మనోహర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే..యువశక్తి కార్యక్రమానికి గురించి డిసెంబర్ 23వ తేదీన డీజీపీకి ఉత్తరం రాశామన్నారు మనోహర్. 24వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి అనుమతి కోరామన్నారు. రూట్ మ్యాప్స్, భద్రత ఏర్పాట్లు, సౌకర్యాల వివరాలు తెలియచేశామని తెలిపారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుతున్న కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతున్నట్లు మనోహర్ వెల్లడించారు.