జనసేన పార్టీకి క్షేత్రస్థాయి బలగమే బలం : నాదెండ్ల మనోహర్

Janasena :బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది అంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన మీరందరికి అభినందనలన్నారు. రాష్ట్రానికి  పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం… ఆ దిశగా మనందరం కలసికట్టుగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షుల సమావేశం శుక్రవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “పార్టీ నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్న పని అని.. నాలుగు గోడల మధ్య, నలుగురు పెద్ద మనుషులు ఇచ్చిన సలహాల మేరకు పార్టీ నిర్మాణం చేపట్టలేదని.. సమాజానికి ఉపయోగపడే రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారని అన్నారు. ఆ దిశగా వేసిన అడుగుల్లో మీరందరూ భాగస్వాములు కావడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం జెండా పట్టుకొని నిస్వార్ధంగా పని చేసిన ప్రతి ఒక్కరు ఈ రోజు మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులుగా నియమితులయ్యారని స్పష్టం చేశారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారు, టైలరింగ్ పనులు చేసేవాళ్లు ఉన్నారు.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లినప్పుడు నాయకత్వంలో తేడాలు ఉంటాయి.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో తేడాలు ఉంటాయి..కొన్నింటిని రాజకీయంగా, మరికొన్నింటిని సామాజికంగా ఎదుర్కొవాలని నాదెండ్ల సూచించారు.

తెగింపు మరవలేనిది ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చేయకుండా ఎన్ని వేధింపులకు గురి చేశారో మనందరికీ తెలుసన్నారు మనోహర్. ప్రతిస్థానం ఏకగ్రీవం కావాలని మూర్ఖ ముఖ్యమంత్రి స్థానిక నాయకత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మన కళ్లారా చూశామని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు మంచి పద్దతి కాదని  పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు మీరందరూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేశారని మనోహర్ పేర్కొన్నారు.

కౌలు రైతుకు అండగా నిలబడ్డాం

రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉందన్నారు నాదెండ్ల. ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసి వారికి అండగా ఉండాలని  పవన్ కళ్యాణ్  ఉగాది పర్వదినం నాడు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 700 వందల మంది చనిపోయి ఉంటారు.. వారి కుటుంబానికి లక్ష చొప్పున ఇచ్చి ఆర్థికంగా ఆదుకుందాం అని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇందుకోసం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారన్నారు. చివరకు రాష్ట్రవ్యాప్తంగా లెక్కలు తీస్తే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 3 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా ఎక్కడ వెనుదిరిగి చూడకుండా అందరికీ సాయం చేయాలని జన సేనాని నిర్ణయించుకున్నారన్నారు. ప్రతి జిల్లా వెళ్తూ అక్కడ చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. వారి పిల్లల చదువులకు అవసరమయ్యే వసతులు కల్పిస్తున్నామని నాదెండ్ల తేల్చిచెప్పారు.

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole