జనసేన యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం..

జనసేన యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం చేశామన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ . సభా వేదిక నుంచి జనసేన భవిష్యత్తు కార్యాచరణను  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారని తెలిపారు.  రణస్థలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించబోయే యువశక్తి సభ వేదిక వద్ద.. వైసీపీ ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎంత మభ్యపెడుతుందో చెప్పడానికి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజలను పూర్తిగా అయోమయంలోకి నెట్టి ఒకసారి విశాఖ రాజధాని కావాలని..మరోసారి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ రకరకాల మాటలు చెప్పిన వైసీపీ పాలకులు ఇప్పుడు ఏకంగా విశాఖను రాష్ట్రం చేయాలని కోరడం వెనుక వారి కుట్రలు దాగి ఉన్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనికి కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు.

 ఇక “వివేకానంద జయంతి సందర్భంగా.. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా బహిరంగ వేదికల మీద యువతకు ఇవ్వని అవకాశం జనసేన పార్టీ ఇస్తుందన్నారు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు. యువతలోని అంతులేని ఆవేదనను ప్రపంచానికి తెలియజెప్పే గొప్ప ప్రయత్నమని కొనియాడారు. రాష్ట్రంలోని యువత.. చదువుకున్న దగ్గరనుంచి, ఉపాధి పొందే వరకు వారికి నిత్యం ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని.. వారి గుండె ఘోషను వేదిక నుంచి అందరికీ తెలియజేప్పెలా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్.. వంద మంది యువతకు తన సమక్షంలో మాట్లాడే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని.. నేటి యువతరమే రేపటి భవిష్యత్తుకు పునాదులని నాగబాబు పేర్కొన్నారు.

 

 

Optimized by Optimole