JitenderReddymovie:దేశ భక్తి, సాయుధ పోరాటం, విప్లవ వీరులు గురించి అనేక బయోపిక్ లు వచ్చాయి. తాజాగా తెలంగాణ జగిత్యాలకు చెందిన ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..!
కథ:
1980 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జగిత్యాల జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కథ ఇది.వామపక్షాలు బలంగా ఉన్న కాలంలో నక్సలైట్లకు, ఆర్ఎస్ఎస్ కు మధ్య పోరాటంలో ఏబీవీపీ జితేందర్ రెడ్డి( రాకేష్ వర్రె )కీలకపాత్ర పోషించాడు. చివరకు నక్సల్స్ చేతిలో మరణించాడు. అసలు జితేందర్ రెడ్డి బాల్యం ఎలా గడిచింది? విద్యార్థి నాయకుడిగా ఎలా ఎదిగాడు? ఆయనపై ఆర్ఎస్ఎస్ గోపన్న ప్రభావం ఎంత? రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాడు? నక్సల్స్ తో ఎలాంటి పోరాటం చేశాడు? స్నేహితురాలు లాయర్ శారద ( రియా సుమన్) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే..?
కరీంనగర్ ,జగిత్యాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఆయన కుటుంబ నేపథ్యం మాత్రం పెద్దగా బయటి ప్రపంచానికి తెల్వదు. ఆయన నక్సల్స్ పై ఎలా పోరాటం చేశారు? ఎలా మరణించారు? తెలిపే ప్రయత్నమే జితేందర్ రెడ్డి కథ. సినిమా పరంగా ఫస్ట్ ఆఫ్ బాగుంది. సెకండాఫ్ అదిరిపోయింది. స్టూడెంట్ లీడర్ గా జితేందర్ రెడ్డి ఎదిగిన తీరుతో పాటు స్వయంగా నక్సలైట్లపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే సన్నివేశాలు, క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉంటాయి. హృదయాన్ని హత్తుకునేలా క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ సినిమాకే హైలెట్.
ఎలా చేశారంటే..?
నటనపరంగా రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి పాత్రలో జీవించేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ఆర్ఎస్ఎస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ రియా సుమన్ నటన పరంగా ఆకట్టుకుంది. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతికంగా:
దర్శకుడు తను చెప్పాలనుకున్న పాయింట్ ను తెరపై ప్రజెంట్ చేయడంలో విజయం సాధించాడు. ప్రతి పాత్రను తెరపై అద్భుతంగా చూపించాడు. కొన్ని కొన్ని సన్నివేశాలలో రాకేష్ పాత్రను చూస్తుంటే జితేందర్ రెడ్డిని చూసినట్లే అనిపించేలా ఉంటుంది. సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది.
“ఒక్క మాటలో చెప్పాలంటే జితేందర్ రెడ్డి పోరాటానికి సెల్యూట్ కొట్టాల్సిందే..”
రివ్యూ: 4/ 5 ( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)