Karthikaekadashi: కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత తెలుసా..?

Ekadashi2024:  ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రభోదైక దశి.. బృందావన ఏకాదశి.. బోధన ఏకాదశి.. ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడశుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు (శయనించిన) ఉపక్రమించిన మహావిష్ణువు కార్తిక ఏకాదశిన మేల్కొన్నాడని పురాణ కథనం. పవిత్రమైన ఈ రోజున ఉదయాన్నే స్నానమాచరించి విష్ణు ఆలయం లేదా శివాలయానికి వెళ్లి యథాశక్తి అర్చన చేయాలి. తులసి దళాలతో హరిని.. బిల్వ దళాలతో హరుడుకి అర్చన చేసి ఉపవాసం ఉండాలి. మర్నాడు ద్వాదశ ఘడియలు ఉండగానే విష్ణు పూజ..పారణం( భోజనం) చేసి వ్రతాన్ని ముగించాలి.ఈ వ్రతం ఆచరించిన వారు జీవితంలో సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పినట్లు పురాణాల్లో వివరించబడింది. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి సకల శుభాలు కలగడమే కాక యమకింకరుల దర్శనం ( నరకానికి వెళ్ళరని) తప్పుతుందని శాస్త్రవచనం.

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశి తో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడని.. యజ్ఞ వల్క్య మహర్షి సైతం ఈరోజున జన్మించారని పురాణాల్లో తెలుపబడింది. కార్తిక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు – నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశి తో వెయ్యి అశ్వమేధ యాగాలు.. వంద రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు.

కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరించే వారు అన్నదానం చేస్తే.. సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు కిన్నరులు, కిమ్ పురుషులు, మహర్షులు, తమ కీర్తనలు.. భజనలు..హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్ర లేపుతారు. అందువల్ల ఏకాదశి వ్రతం పాటించే వారు మహా విష్ణువుకు హారతి ఇస్తే అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాల్లో వివరించబడింది.

Optimized by Optimole