హైదరాబాద్:
అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాగిస్తున్న విషప్రచారం మరోసారి బట్టబయలైంది. ప్రతి సందర్భంలో ఆయన ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నట్టు రుజువైంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నకిలీ ఓటర్లను నమోదు చేస్తోందంటూ ఆయన చేస్తున్న దుష్ప్రచారం తప్పని నిరూపితమైంది. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఈసీ స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ హయాంలోనే ఓటర్ల నమోదు:
ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఒకే ఇంట్లో 43 మంది నకిలీ ఓటర్లను నమోదు చేశారనే తప్పుడు ప్రచారానికి కేటీఆర్ తెరలేపారు. తద్వారా కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడుతోందంటూ విషప్రచారాన్ని ప్రారంభించారు. దీనిపై విచారణ జరపగా కేటీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ తేల్చిచెప్పింది. హౌస్ నంబర్ 8-3-231/బి/118లో 50 మంది, హౌస్ నంబర్ 8-3-231/బి/160లో ఉన్న 43 మంది ఓటర్ల పేర్లు ముందు నుంచి జాబితాలో ఉన్నవే అని స్పష్టం చేసింది. అంతేకాకుండా 2023లోనే వీరందరూ ఓటర్లుగా నమోదైనట్టు వెల్లడించింది. అంటే, బీఆర్ఎస్ హయాంలోనే వీరందరూ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్నట్టు స్పష్టమవ్వడంతో కేటీఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి తెరపడింది.
ఈ ఓటర్లంతా 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తుది ఓటర్ల జాబితాలో, అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల తుది జాబితాలో కూడా ఉన్నారని ఈసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, 2023 నుంచి ఆయా ఇంటి చిరునామాలలో ఓటర్ల సంఖ్యలో ఎటువంటి మార్పు జరగలేదని కూడా వెల్లడించింది. కొత్త ఓటర్లు చేరారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిగా తేల్చి చెప్పింది. ఈ చిరునామాలు బహుళ అంతస్తుల భవనాలు కావడం, ఒకదాంట్లో 15 ఫ్లాట్లు ఉండడం, ఇంకో భవనంలో 3 అంతస్తులు సహా పెంట్‌హౌస్ ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఒకే చిరునామాలో ఉండటానికి గల కారణమైందని విచారణలో వెల్లడించింది.
బుద్ధి మార్చుకోని కేటీఆర్:
కాంగ్రెస్ ప్రభుత్వం మీద రోజుకొక విషప్రచారం చేస్తున్న కేటీఆర్ ప్రతి సందర్భంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు. పలు అంశాలపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసిన ప్రతిసారీ అబాసుపాలవుతున్నారు. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. గతంలో ఫాక్స్‌కాన్ సంస్థను బెంగళూరుకు తరలించుకుపోయేందుకు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారంటూ ఓ లేఖ చూపిస్తూ తప్పుడు ప్రచారం చేశారు. తీరా అది నకిలీ లేఖ అని తేలడంతో కేటీఆర్ తప్పుఒప్పుకున్న పరిస్థితి. లేఖను బహిర్గతం చేసేముందు తాను రుజువు చేసుకోలేదని చెప్పి తప్పించుకున్నారు. మరో సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
అయితే, అది 2018 బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన ఘటన అని తెలుసుకొని పోస్టును డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇటీవల గ్రూప్-1 పోస్టులను రూ.3 కోట్లకు అమ్ముకున్నారనే తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అయితే, ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న కేటీఆర్ ప్రతి సందర్భంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై తాను చేసే ఆరోపణలకు, విషప్రచారానికి ఆధారాలు ఉండవు అనే విషయాన్ని కేటీఆర్ మరోసారి నిరూపించుకున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.