Hyderabad:
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మరోసారి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటర్లను నమోదు చేసిందని కేటీఆర్ ప్రదర్శించిన వివరాలలోని డొల్లతనం తేటతెల్లమైంది.
కేటీఆర్ ఆరోపణల ప్రకారం, 19,000 ఓటర్లను జాబితాలో చేర్చారని, ఇందులో 1,942 ఓటర్లు పలుమార్లు నమోదయ్యారని, యూసుఫ్‌గూడలోని రెండు చిరునామాలలో వరుసగా 32, 43 మంది ఓటర్లు, హైలం కాలనీలో అడ్రస్సులేని చిరునామాలో 42 మంది ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, దీనిపై స్పందించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కేటీఆర్ ఆరోపణలను కొట్టిపారేశారు.
కేటీఆర్ లేవనెత్తిన ఓటర్ల జాబితా కొత్తగా నమోదు చేసినది కాదని, 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల జాబితాలోనే ఆ ఓటర్లు నమోదైనట్టు ఈసీ తేల్చిచెప్పింది. కేటీఆర్ లేవనెత్తిన చిరునామాలు బహుళ అంతస్తుల భవనాలు కావడం వల్లే ఆ మేరకు ఓటర్లు నమోదైనట్టు స్పష్టం చేసింది. కేటీఆర్ ఆరోపణలపై పలువురు విశ్లేషకులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఓటరు జాబితాలో అవకతవకలు జరిగివుంటే 2023లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచినప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఓటర్లంటూ కేటీఆర్ లేవనెత్తిన ఓటర్ల జాబితాలోని పేర్లు 2023, 2024లోనే నమోదైనట్టు కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది. కేటీఆర్ లేవనెత్తిన ఆరోపణల ద్వారా బీఆర్ఎస్ స్వయంగా పాల్పడిన ఓట్ చోరీ ఉదంతం బయటపడిందని వ్యాఖ్యానించింది.