ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారం సొంతం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన అస్త్రాలకు పదును పెడుతోంది. యువగళం పాదయాత్ర ద్వారా లోకేశ్ ప్రజల్లోకి వెళుతున్నారు. దీనికి తోడుగా, వీలైనన్నీ ఎక్కువ దారుల్లో ప్రజల్లోకి చేరుకోవడానికి, జగన్ పాలనను ఎండగట్టడానికి ప్రయత్నాలు ఉధృతం చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడుతోన్న రవితేజ నటించిన ధమాకా సినిమాలోని జింతక పాటకు పేరడిగా లోకేశ్ పాదయాత్ర పాటను రూపొందించారు తెలుగుదేశం అభిమానులు. ’’జెండా పట్టబుద్ధాయితాంది… లోకేశో…. జై కొట్ట బుద్ధాయితాంది… లోకేశో…. ’’ అని మొదలయ్యే ఈ పాట చిన్నదే అయినా…. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సులభంగా నోటికి పాడేలా ఉండటంతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేశారు. పరోక్షంగా జగన్ ని టార్గెట్ చేసిన ఈ పాట, ఇప్పుడు జగన్ కోటలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోందని, పాదయాత్ర తమకు అధికారం దూరం చేస్తుందనే భయం వైసీపీకి పట్టుకుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ట్రెండింగ్ లో ఉన్న లోకేశ్ పాదయాత్ర పాట లిరిక్స్ మీకోసం…
*యువగళం పాట లిరిక్స్:*
జెండా పట్టబుద్ధాయితాంది… లోకేశో….
జై కొట్ట బుద్ధాయితాంది… లోకేశో….
కోరస్: జింతక జింతక జింతక జిన్ జిన్నా…
జింతక జింతక జింతక
పల్లె పల్లెకొస్తున్నాడు… లోకేశో….
పోరు దండు కడుతున్నాడు.. లోకేశో…
కోరస్: జింతక జింతక జింతక జిన్ జిన్నా…
జింతక జింతక జింతక
నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే…
నిన్ను జూత్తే… సైకోకి ఉంటాది.
గుండె సైరను కొట్టేసుకుంటాది
కోరస్: జింతక జింతక జింతక జిన్ జిన్నా…
జింతక జింతక జింతక
జెండా పట్టబుద్ధాయితాంది… లోకేశో….
అడుగెయ్యబుద్ధాయితాంది… లోకేశో…
ఈ నెల 27వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రారంభం కానున్న లోకేశ్ యువగళం పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు తరహాలో పార్టీ నాయకులంతా ఈ పాదయాత్ర ప్రారంభానికి హాజరవుతున్నారు. మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోనే లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది. పార్టీ సీనియర్లు.. నియోజకవర్గాల ఇంఛార్జ్ లు..అనుబంధ సంఘాల నేతలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు లోకేశ్ కు మద్దతుగా కుప్పం చేరుకోనున్నారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలో మీటర్ల యాత్ర నిర్వహించేందుకు టీడీపీ కార్యవర్గం ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా మధ్య మధ్యలో రోడ్ షో..సమావేశాలు నిర్వహించనున్నారు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా యువత పెద్ద సంఖ్యలో లోకేశ్ ని అనుసరించేలా ప్రణాళికలు సిద్దం చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తిరగడం వల్ల, క్షేత్ర స్థాయి పరిస్థితులు క్షుణ్ణంగా తెలుస్తాయి. దీంతో కొలిమిలో పడిన బంగారంలా నాయకులు తయారవుతారు. నాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నుంచి నిన్నటి జగనే దీనికి నిదర్శనం. ఇప్పడు పాదయాత్ర చేయబోతున్న లోకేశ్ కి కూడా ప్రజానాయకుడిగా మారేందుకు చరిత్ర మహత్తర అవకాశం ఇవ్వబోతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.